Sanju Samson: ఆసియా కప్ నుంచి సంజు శాంసన్ వెనక్కి
- కీలకమైన సూపర్ 4కు ముందు అందుబాటులోకి కేఎల్ రాహుల్
- గ్రూప్ దశ మ్యాచ్ లకు అందుబాటులో లేని రాహుల్
- అతడికి బ్యాకప్ గా శాంసన్ ను ఎంపిక చేసిన సెలక్టర్లు
ఆసియా కప్ నుంచి సంజు శాంసన్ ఇంటి ముఖం పట్టాడు. బీసీసీఐ అతడ్ని వెనక్కి రప్పించింది. సూపర్-4కు ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. కేఎల్ రాహుల్ అందుబాటులోకి రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి కేఎల్ రాహుల్ బ్యాకప్ గానే సెలక్టర్లు శాంసన్ ను ఎంపిక చేశారు. కేఎల్ రాహుల్ గత ఐపీఎల్ సమయంలో తొడ కండరాల గాయం బారిన పడి, శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతడి ఫిట్ నెస్ పై సందేహాలు ఉండడంతో బ్యాకప్ గా ఎందుకైనా మంచిదన్న ఉద్దేశ్యంతో శాంసన్ ను కూడా ఎంపిక చేశారు.
కేఎల్ రాహుల్ ఫిట్ నెస్ ఓకే కావడంతో ఇక శాంసన్ అవసరం లేదనుకున్న సెలక్టర్లు అతడ్ని శ్రీలంక నుంచి వెనక్కి పిలిపించారు. గ్రూప్ దశ మ్యాచ్ లకు రాహుల్ అందుబాటులో లేకపోవడం కూడా శాంసన్ ను ఎంపిక చేయడానికి మరో కారణంగా ఉంది. రాహుల్ గాయం నుంచి కోలుకోవడంతో, బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో సూపర్ 4లో కీలక మ్యాచ్ లకు ముందు అందుబాటులోకి వచ్చాడు. గురువారం నెట్ ప్రాక్టీస్ లో పాల్గొని, ఎన్నో గంటల పాటు బ్యాటింగ్ చేయడంతో, ఇక శాంసన్ అవసరం లేదనుకున్నట్టు కనిపిస్తోంది. వన్డే ప్రపంచకప్ 2023 బృందంలోనూ శాంసన్ కు చోటు లభించని విషయం తెలిసిందే.