Chandrababu: చంద్రబాబుకు హెలికాప్టర్ ఆఫర్ చేశాం.. కానీ ఆయన నిరాకరించారు: ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్
- నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు
- చంద్రబాబు వయసును దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్న అడిషనల్ డీజీ
- ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో లోకేశ్ ను విచారిస్తామని వెల్లడి
స్కిల్ డెవలస్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర ఉందనే ఆరోపణలతో ఏపీ సీఐడీ ఈ ఉదయం ఆయనను నంద్యాలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ మాట్లాడుతూ... చంద్రబాబును విజయవాడకు తీసుకురావడానికి హెలికాప్టర్ ను అరేంజ్ చేశామని, అయితే హెలికాప్టర్ ను ఆయన నిరాకరించారని చెప్పారు. రోడ్డు మార్గంలోనే వస్తానని చంద్రబాబు చెప్పారని తెలిపారు.
చంద్రబాబు వయసును, ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సంజయ్ చెప్పారు. ఇప్పటికే 50 శాతం ప్రయాణం పూర్తయిందని తెలిపారు. ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేశామని... సాయంత్రం 6 లోగా విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరుస్తామని చెప్పారు. మరోవైపు ఈ కేసులో నారా లోకేశ్ ను కూడా విచారిస్తామని తెలిపారు. ఈ కేసుతో పాటు ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో కూడా లోకేశ్ ను లోతుగా విచారిస్తామని చెప్పారు.