new direction: అపనమ్మకానికి ముగింపు పలుకుదాం.. కలసి నడుద్దాం: ప్రధాని పిలుపు
- సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ అని ప్రధాని నినాదం
- పెరిగిపోయిన అపనమ్మకాన్ని తొలగించుకుందామని పిలుపు
- ప్రపంచ మంచి కోసం కలసి పనిచేద్దామని ప్రకటన
జీ20 సదస్సు వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. కరోనా తర్వాత ప్రపంచంలో అపనమ్మకం పెరిగిపోయిందంటూ.. దురదృష్టవశాత్తూ యుద్ధం (రష్యా-ఉక్రెయిన్) దీన్ని మరింత తీవ్రతరం చేసిందన్నారు. నమ్మకం, విశ్వాసంతో కలసి ప్రపంచ మేలు కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. పాత కాలం నాటి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన సమయంలో మనమంతా ఉన్నామంటూ, మానవతా దృక్పథంతో మన బాధ్యతలను నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రపంచానికి 21వ శతాబ్దంలో కొత్త మార్గాన్ని చూపాల్సి ఉందన్నారు. ‘‘మనమంతా ఒకటి గుర్తు పెట్టుకోవాలి. కరోనా వంటి మహమ్మారిని ఓడించినప్పుడు ఈ విశ్వాసలేమి సవాలును కూడా మనం అధిగమించగలం’’ అని ప్రధాని పేర్కొన్నారు.
‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్’ అనే భారత నినాదాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. జీ20కి భారత్ నాయకత్వం చేరికకు చిహ్నంగా మారినట్టు పేర్కొన్నారు. ఇంటా, బయటా అందరితో కలసి అన్న దానికి సబ్ కా సాత్ ను ప్రస్తావించారు. ‘‘ఇది ప్రజల జీ20 సదస్సు. 60కు పైగా పట్టణాల్లో 200కు పైగా కార్యక్రమాలు చేపట్టాం. ప్రపంచానికి మంచి చేసేందుకు మనమంతా కలసి పనిచేద్దాం’’ అని ప్రధాని పిలుపునిచ్చారు.