kanna lakshminarayana: ప్రభుత్వ పునాదులు కదులుతున్నాయనే సీఎం జగన్ బరితెగింపు: కన్నా లక్ష్మీనారాయణ
- టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై ఆగ్రహం
- గొప్ప లక్ష్యంతో చేసిన ప్రాజెక్ట్ పై నిరాధార ఆరోపణలన్న కన్నా
- సైకో ముఖ్యమంత్రి కనుసన్నల్లో సీఐడీ, సీబీసీఐడీ అంటూ విమర్శలు
- జగన్ రెడ్డికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని వ్యాఖ్య
యువగళంతో లోకేశ్, ప్రజాబలంతో చంద్రబాబు తన ప్రభుత్వ పునాదులు కదుపుతున్నారన్న భయంతోనే ముఖ్యమంత్రి జగన్ బరి తెగించాడంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు కురిపించారు. సదుద్దేశంతో, గొప్ప లక్ష్యంతో గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై ఆది నుంచి జగన్ రెడ్డి ప్రభుత్వం దురుద్దేశంతో నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో సీబీసీఐడీ, సీఐడీ విభాగాలు సైకో ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడుస్తున్నాయనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన ఈ విషయమై విలేకరులతో మాట్లాడారు.
“ ప్రభుత్వ పరిధిలో ప్రజల కోసం నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన సీబీసీఐడీ, సీఐడీ ఇతర సంస్థలు కేవలం జగన్ రెడ్డి కక్షసాధింపుల వ్యవహారాల్లోనే మునిగి తేలుతున్నాయి. రాయలసీమ పర్యటనలో, ప్రజల మధ్యలో ఉన్న చంద్రబాబునాయుడి వద్దకు అర్ధరాత్రి వెళ్లి అరెస్ట్ పేరుతో హంగామా చేయాల్సిన అవసరం ఏమిటో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గిట్టని వాళ్లను జైళ్లకు పంపాలన్న జగన్ రెడ్డి కోరికలో భాగమే చంద్రబాబు అక్రమ అరెస్ట్. జాతీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి విషయంలో విచారణ సంస్థలు పరిధి దాటి వ్యవహరించాయి’’ అని కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు.
జగన్ రెడ్డి గతంలో అవినీతి కేసుల్లో తాను ఎలా జైలు పాలయ్యాడో.. అదే విధంగా తనకు గిట్టని వారిని జైళ్లకు పంపే ఉద్దేశ్యంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు కన్నా ఆరోపించారు. దేశంలోనే ధనవంతుడిగా పేరు ప్రఖ్యాతులు పొందడం కోసం ఒకవైపు ప్రజల్ని దోపిడీ చేస్తూ.. మరోవైపు ప్రతిపక్షాలను తప్పుడు కేసులతో దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని విమర్శించారు. ముద్దాయి ఇచ్చిన ఆదేశాలతో అమాయకులపై పోలీసులు జులుం ప్రదర్శించడం ఎంతమాత్రం సరైంది కాదన్నారు. సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి పనిగట్టుకొని మరీ చంద్రబాబుని అరెస్ట్ చేయడాని కి వెళ్లినప్పుడే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కేసు విచారణ ఎంత పారదర్శకంగా జరిగిందో స్పష్టమైందన్నారు. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ద్వారా 2లక్షల యువతకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి లభించిందని.. రాష్ట్రవ్యాప్తంగా ఆ ప్రాజెక్ట్ పరిధిలోని శిక్షణా కేంద్రాలు ఉత్తమ శిక్షణతోపాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించినట్టు జగన్ రెడ్డి ప్రభుత్వమే గతంలో ప్రశంసలతో కూడిన నివేదిక ఇచ్చిన విషయాన్ని కన్నా గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చినప్పటినుంచీ చేసిన అవినీతి, దోపిడీ బయటపడి, ఎక్కడ తనను ప్రజలు అసహ్యించుకుంటారోనన్న భయంతోనే జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని కుట్ర రాజకీయాలకు తెరలేపాయని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా వ్యవహరిస్తున్న సైకో ముఖ్య మంత్రికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. సైకో చెప్పిందానికి తలాడించి, పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారులు కూడా భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమన్నారు. జగన్ రెడ్డి పైశాచిక వికృత చర్యలకు కర్రుకాల్చి వాతలు పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కన్నా తెలిపారు.