Botsa Satyanarayana: నిప్పులాంటి వ్యక్తి అయితే కోర్టులో తేల్చుకోవాలి: చంద్రబాబు అరెస్ట్‌పై బొత్స సత్యనారాయణ
- చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగిందన్న బొత్స
- స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనే ప్రధాన సూత్రధారి అని వ్యాఖ్య
- అవినీతి చేశారు కాబట్టే సీఐడీ అరెస్ట్ చేసిందన్న మంత్రి
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. శనివారం ఆయన మాట్లాడుతూ... ఈ అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనే ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే సీఐడీ అరెస్ట్ చేసిందని, ఆయన ఏ తప్పు చేయకుంటే... నిప్పులాంటి వ్యక్తి అయితే కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. ఏ విషయంలోనైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అవినీతికి పాల్పడిన వారికి శిక్ష పడవలసిందే అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. ఆయన అవినీతి చేశారు కాబట్టి అరెస్ట్ చేశారన్నారు.
చంద్రబాబుపై బొత్స ట్వీట్లు
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో బొత్స సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. 'కప్పిపుచ్చలేడు. స్కిల్ డెవెలప్మెంట్ స్కాం ద్వారా రూ. 371 కోట్ల ప్రజాధనాన్ని బాబు దారిమళ్లించాడు, దోచుకున్నాడు. 2014 నుండి 2019 వరకు బాబు పాలనలో దేశ చరిత్రలో ఎక్కడా జరగని అవినీతి ఏపీలో జరిగింది. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి.. యువతకు మంచి చేయాల్సిన చోటే చంద్రబాబు తప్పుడు పనులు చేశాడు. అవినీతి చేసినవాడు చంద్రబాబేలే అని చట్టం ఊరుకుంటుందా?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.