Vijayasai Reddy: కాస్త ఆలస్యం అయితే అయింది కానీ...!: చంద్రబాబు అరెస్ట్ పై విజయసాయిరెడ్డి స్పందన
- స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్
- ఇది ఆరంభం మాత్రమేనన్న విజయసాయిరెడ్డి
- రామోజీకి కూడా చట్టం వర్తిస్తుందని వెల్లడి
- ఇక శిక్షా సమయం ఆసన్నమైందని స్పష్టీకరణ
విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. కాస్త ఆలస్యం అయితే అయింది కానీ అరెస్ట్ మాత్రం పూర్తి ఆధారాలతో జరిగిందని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు.
చంద్రబాబు అండ్ కో జీవితాంతం జైలులో ఉండాల్సినన్ని స్కాంలకు పాల్పడ్డారని విజయసాయి ఆరోపించారు. చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీకి కూడా చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ తప్పించుకోగలిగారు కానీ, ఇక శిక్షా సమయం ఆసన్నమైందని ఉద్ఘాటించారు.
"చంద్రబాబు తన హయాంలో 2014-19 మధ్య లెక్కలేనన్ని నేరాలకు పాల్పడ్డారు. వాటిలో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఒకటి. ఇందులో అధికార దుర్వినియోగం, మనీ లాండరింగ్, చీటింగ్ అంశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. స్వలాభాల కోసం చంద్రబాబు ప్రజాధనాన్ని షెల్ కంపెనీలకు మళ్లించాడు. సీమెన్స్ కంపెనీతో ఎంవోయూ పేరిట భారీ కుంభకోణానికి సూత్రధారిగా నిలిచాడు.
సంక్షేమం, అభివృద్ధి పేరిట ప్రజాధనం దోపిడీకి పాల్పడడం క్షమించరాని నేరం. టీడీపీ అధినేత కుంభకోణానికి పాల్పడినట్టు సీఐడీ, ఏసీబీ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి" అని విజయసాయి వివరించారు.