Chandrababu: సిట్ కార్యాలయంలోకి న్యాయవాదులకు అనుమతి నిరాకరణ.. సిట్ అధికారికి లేఖ రాసిన చంద్రబాబు
- సిట్ అధికారుల తీరుపై న్యాయవాదుల తీవ్ర అభ్యంతరం
- ఏ నిబంధనల మేరకు అనుమతి నిరాకరిస్తున్నారని ప్రశ్న
- కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ఆయన తరఫు న్యాయవాదులు ప్రయత్నించగా, సిట్ కార్యాలయంలోకి వారికి అనుమతిని నిరాకరించారు. సిట్ అధికారుల తీరుపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫు న్యాయవాదులను అనుమతించి, తమను అనుమతించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నిబంధనల ప్రకారం తమను కలవకుండా అడ్డుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. దర్యాఫ్తు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మరోవైపు, సిట్ ఇన్వెస్టిగేషన్ అధికారికి చంద్రబాబు లేఖ రాశారు. తన తరఫు లాయర్లను లోపలికి అనుమతించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
కాసేపట్లో గవర్నర్ వద్దకు టీడీపీ నేతలు
ఇదిలా ఉండగా, టీడీపీ నేతలు కాసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. రాత్రి గం.7.15 సమయానికి వారికి గవర్నర్ అపాయింటుమెంట్ ఇచ్చారు. టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు తదితరులు రాజ్ భవన్లో గవర్నర్‌ను కలవనున్నారు.