Jai Shankar: ఇది బాలి కాదు... ఢిల్లీ: కేంద్రమంత్రి జై శంకర్
- జీ20 సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ కు ఏకాభిప్రాయం
- భారత్ ప్రతిపాధించిన ఉమ్మడి డిక్లరేషన్ కు జీ20 దేశాల ఆమోదం
- గతేడాది బాలిలో డిక్లరేషన్ ను వ్యతిరేకించిన రష్యా, చైనా
- ఉక్రెయిన్ అంశం డిక్లరేషన్ లో ఉండడమే అందుకు కారణం
- ఈసారి అనూహ్యరీతిలో ఆమోదం తెలిపిన చైనా, రష్యా
- భారత్ కు అతి పెద్ద దౌత్య విజయం... మరింత పెరిగిన ప్రతిష్ఠ
ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యమిస్తున్న భారత్ కు దౌత్యపరంగా అతి పెద్ద విజయం లభించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన న్యూ ఢిల్లీ డిక్లరేషన్ కు జీ20 దేశాల ఆమోదం లభించింది.
ఈ డిక్లరేషన్ లో ఉక్రెయిన్ అంశం కూడా ఉండడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే... గతేడాది ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 సదస్సులో ఉక్రెయిన్ అంశంపై చర్చకు రష్యా, చైనా ససేమిరా అన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాల్లో తాజా డిక్లరేషన్ కు చైనా, రష్యాలు కూడా ఆమోదం తెలుపడంతో ఏకాభిప్రాయం సాధ్యమైంది.
ఓ దేశానికి సంబంధించిన ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం, ఆ దేశ రాజకీయ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా వెళ్లకపోవడం వంటి అంశాలను ఈ డిక్లరేషన్ లో పొందుపరిచారు. ఉక్రెయిన్ ను దృష్టిలో ఉంచుకుని ఈ అంశాలను డిక్లరేషన్ లో ప్రస్తావించారు. భారత్ చేసిన ప్రయత్నం ఫలించడంతో రష్యా, చైనా ఎలాంటి వ్యతిరేకత చూపకుండా ఢిల్లీ డిక్లరేషన్ కు సమ్మతి తెలిపాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. ఈ డిక్లరేషన్ కు చైనా ఒప్పుకోవడం వల్ల ఎంతో మద్దతు లభించినట్టయిందని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ డిక్లరేషన్ కు ఏకాభిప్రాయం సాధించేందుకు గత కొన్నిరోజులుగా ఎంతో శ్రమించామని వెల్లడించారు.
కాగా, ఢిల్లీ డిక్లరేషన్ ఏకాభిప్రాయం పొందడం అసాధ్యమని జీ20 సదస్సు ప్రారంభానికి ముందు ఊహాగానాలు వినిపించాయి. అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్ కిర్బీ స్పందిస్తూ, రష్యా-ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో ఈ ఉమ్మడి డిక్లరేషన్ కు ఆమోదం లభించకుండానే జీ20 సదస్సు ముగస్తుందని జోస్యం చెప్పారు. దానికితోడు చైనా ఇటీవల విడుదల చేసిన ప్రామాణిక మ్యాప్ ను భారత్ తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఈ డిక్లరేషన్ కు డ్రాగన్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్న ఆశలు అడుగంటాయి.
అయితే భారత విదేశాంగ మంత్రి జై శంకర్ బృందం అన్ని మార్గాల్లో సంప్రదింపులు, చర్చలతో చైనా, రష్యా ప్రభుత్వాలను డిక్లరేషన్ కు అనుకూలంగా స్పందించేలా కృషి చేసింది. ఈ నేపథ్యంలో ఓ మీడియా ప్రతినిధి జై శంకర్ ను వివరణ కోరారు. ఆ రిపోర్టర్ గతేడాది బాలిలో ప్రకటించిన డిక్లరేషన్ ను, న్యూఢిల్లీ డిక్లరేషన్ ను పోల్చారు.
అందుకు జై శంకర్ బదులిస్తూ... ఇది బాలి కాదు... ఢిల్లీ అని స్పష్టం చేశారు. "బాలి డిక్లరేషన్ ప్రకటించి ఏడాది కావస్తోంది... అప్పటి పరిస్థితులు వేరు. అప్పటికీ ఇప్పటికీ ఎన్నో పరిణామాలు సంభవించాయి. మేం రూపొందించిన ఢిల్లీ డిక్లరేషన్ లో 8 పేరాలు ఉంటే, అందులో 7 పేరాలు ఉక్రెయిన్ అంశానికి సంబంధించినవే. మిగిలిన ఒక్క పేరాలో ప్రపంచం ఎదుర్కొంటున్న ఇతర ప్రధాన సమస్యలను పొందుపరిచాం. బాలి ఈజ్ బాలి... న్యూ ఢిల్లీ ఈజ్ న్యూ ఢిల్లీ" అంటూ వివరణ ఇచ్చారు.