Chandrababu: చంద్రబాబుకు వైద్య పరీక్షలు... మళ్లీ సిట్ కార్యాలయానికి తరలింపు
- అర్ధరాత్రి దాటాక చంద్రబాబును ప్రభుత్వాసుపత్రికి తరలించిన సీఐడీ అధికారులు
- విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు
- తిరిగి సిట్ కార్యాలయానికి తరలించడంపై ప్రశ్నించిన చంద్రబాబు
- రిమాండ్ రిపోర్టు ఇంకా సిద్ధం కాలేదని చెప్పిన సీఐడీ అధికారులు
నిన్న నంద్యాలలో అరెస్ట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ దాదాపు గంట పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం చంద్రబాబును కోర్టుకు తీసుకువెళ్లకుండా, తిరిగి సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. మళ్లీ ఎందుకు సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారని చంద్రబాబు ప్రశ్నించగా, రిమాండ్ రిపోర్టు ఇంకా సిద్ధం కాలేదని సీఐడీ అధికారుల నుంచి సమాధానం వచ్చింది.
సిట్ కార్యాలయం బయట నిన్న సాయంత్రం నుంచి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా టీడీపీ శ్రేణులు తమ అధినేత కోసం ఎదురుచూస్తున్నాయి. చంద్రబాబుకు కనీసం నిద్రపోయే అవకాశం కూడా ఇవ్వకుండా సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు.
అటు, విజయవాడలో ఏసీబీ కోర్టు వద్ద కూడా టీడీపీ శ్రేణులు చంద్రబాబు కోసం ఎదురుచూస్తున్నాయి. చంద్రబాబును కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గీయులను పోలీసులు బలవంతంగా పంపించి వేశారు.
చంద్రబాబు వస్తాడని గత అర్ధరాత్రి నుంచి టీడీపీ న్యాయవాదుల బృందంతో కలిసి నారా లోకేశ్ ఎదురుచూస్తున్నారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సైతం అక్కడే ఉన్నారు.