Chandrababu: కోర్టుకు చంద్రబాబు రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ
- స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్
- ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపర్చిన సీఐడీ
- కోర్టు వద్ద భారీ భద్రత... కొనసాగుతున్న విచారణ
ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబును ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ అధికారులు కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి 2021లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేకపోవడంతో, కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చినట్టు తెలుస్తోంది. ఈ మార్పును కోర్టుకు తెలియపరుస్తూ సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.
అంతకుముందు, విచారణ ప్రారంభం సమయంలో తన చాంబర్ లో విచారిస్తానని న్యాయమూర్తి సూచించగా, ఓపెన్ కోర్టు విచారణ జరగాలని టీడీపీ న్యాయవాదుల బృందం కోరింది. దాంతో న్యాయమూర్తి ఓపెన్ కోర్టు విచారణకు అంగీకరించారు.
చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా బృందం వాదనలు వినిపిస్తుండగా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తదితరులు వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు రిమాండ్ పిటిషన్ విచారణ సందర్భంగా విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోర్టు పరిసరాలను పోలీసులు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు.