Chandrababu: చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో అంశాలు వెల్లడి
- స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్
- ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ
- చంద్రబాబు రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ
- సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరిట రిమాండ్ రిపోర్టు
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంకు సంబంధించిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు ఈ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు చెందిన రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తికి అందించారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరిట ఈ రిమాండ్ రిపోర్టు సమర్పించారు.
గతంలో ఈ కేసు ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేకపోగా, చంద్రబాబును ఏ37గా పేర్కొంటూ ఈ ఉదయం ఆయన పేరును చేర్చారు. చంద్రబాబును 15 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కు ఇవ్వాలని సీఐడీ అధికారులు కోర్టును కోరారు.
స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబు ముఖ్యమైన కుట్రదారుడు అని, ప్రజాప్రతినిధిగా ఉండి చంద్రబాబు నేరపూరితమైన కుట్రకు పాల్పడ్డారని సీఐడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. 2021 డిసెంబరు 9 కంటే ముందే నేరం జరిగిందని, తాడేపల్లిలోని స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని తెలిపింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ దీనికి సంబంధించిన అక్రమాలు చోటుచేసుకున్నాయని సీఐడీ వివరించింది.
సీమెన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు చెల్లించారని, రూ.271 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించారని రిమాండ్ రిపోర్టులో ఆరోపించారు.