Karthik: హైదరాబాదులో జూనియర్ ఆర్టిస్ట్ దారుణ హత్య
- ఓ యువకుడ్ని బలిగొన్న ప్రేమ వ్యవహారం
- జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్ యువతితో ప్రేమలో పడిన యూట్యూబర్
- యూట్యూబర్ తీరు నచ్చక దూరం పెట్టిన యువతి
- అనంతరం, మరో జూనియర్ ఆర్టిస్ట్ కు దగ్గరైన వైనం
- కోపంతో రగిలిపోయిన యూట్యూబర్
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం.
విజయనగరం జిల్లాకు చెందిన టి.సాయి హైదరాబాదులో ఉంటూ యూట్యూబ్ వీడియోలు చేసేవాడు. సాయికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తోంది. అయితే సాయి ప్రవర్తన నచ్చకపోవడంతో ఆ యువతి అతడిని దూరం పెట్టింది. అనంతరం ఆమె కార్తీక్ అనే మరో జూనియర్ ఆర్టిస్ట్ కు దగ్గరైంది.
కార్తీక్ స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా సంకిస గ్రామం. ఇటీవల కార్తీక్, ఆ యువతి... కార్తీక్ సోదరుడు శంకర్ గదికి వెళ్లి మూడ్రోజులు ఉన్నారు. ఈ విషయం తెలిసిన యువతి మాజీ ప్రియుడు సాయి రగిలిపోయాడు. విజయనగరం జిల్లాకు చెందిన తన స్నేహితులు జగదీశ్, సురేశ్, రఘుల సాయంతో కార్తీక్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
పక్కా ప్రణాళికతో... కార్తీక్ గదికి వెళ్లి ఆ యువతికి సంబంధించిన దుస్తులు తమ గదిలోనే ఉండిపోయాయని, వచ్చి తీసుకెళ్లాలని అతడిని కోరారు. నిజమే అని నమ్మిన ఆ జూనియర్ ఆర్టిస్ట్ వారితో కలిసి బైక్ పై బయల్దేరాడు. ఓల్డ్ బోయిన్ పల్లి విమానాశ్రయం వద్ద అటవీప్రాంతం వైపు కార్తీక్ ను తీసుకెళ్లిన సాయి బృందం... అతడిపై దాడి చేసింది.
చెట్టుకు కట్టేసి కత్తితో పొడిచారు. కత్తి వంకరపోవడంతో అతడిని కిందపడేసి పీక కోశారు. ఆపై, పెద్ద బండరాయితో తలపై మోదారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకుని సాయి, అతడి మిత్రులు అక్కడి నుంచి నిష్క్రమించారు.
అయితే, ఆగస్టు 13 నుంచి కార్తీక్ కనిపించడంలేదని అతడి సోదరుడు శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు.
సీసీ కెమెరా ఫుటేజి, మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కేసును ఛేదించారు. సాయిని, అతడికి సహకరించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కార్తీక్ ను తామే చంపామని విచారణలో వారు అంగీకరించారు.