ACB Court: ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరుపై సీఐడీకి న్యాయమూర్తి ప్రశ్న
- గతంలో ఎందుకు చేర్చలేదు.. ఇప్పుడెందుకు చేర్చారు? అన్న న్యాయమూర్తి
- ఈ కేసులో చంద్రబాబు పాత్రను నిరూపించే ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్న
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో వాడీవేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదిస్తుండగా.. చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో 409 సెక్షన్ పెట్టడంపై సిద్ధార్థ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. సరైన ఆధారాలు ఉంటే తప్ప ఈ సెక్షన్ వర్తించదని కోర్టుకు వివరించారు. 409 సెక్షన్ ను తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేసు విచారణలో భాగంగా ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును తాజాగా చేర్చడంపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సీఐడీ, ఏఏజీకి పలు ప్రశ్నలు సంధించారు. ఈ కేసుకు సంబంధించి గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును ఎందుకు చేర్చలేదని అడిగారు. అదేవిధంగా ఇప్పుడు ఆయన పేరును చేర్చడానికి కారణాలేంటని ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయం ఉందనేందుకు తగిన ఆధారాలు ఉన్నాయా అని ఏఏజీని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం తరఫున ఏఏజీ సుధాకర్ రెడ్డి జవాబిచ్చారు. వాదోపవాదాలు కొనసాగుతుండగా.. న్యాయమూర్తి కాసేపు బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత ఏఏజీ తన వాదనలు కొనసాగిస్తున్నారు. అనంతరం చంద్రబాబు న్యాయవాది లూథ్రా తన వాదనలు వినిపించనున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు. ప్రస్తుతం విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.