asia cup: మరికాసేపట్లో భారత్–పాకిస్థాన్ పోరు.. ఈసారైనా వరుణుడు కరుణిస్తాడా?
- ఆసియా కప్ సూపర్4 రౌండ్లో దాయాది జట్ల మ్యాచ్
- వర్షంతో ఇప్పటికే రద్దయిన గ్రూప్ మ్యాచ్
- నేటి మ్యాచ్కు రేపు రిజర్వ్ డే
ఆసియా కప్ సూపర్4 రౌండ్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఈ రోజు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో పోటీ పడనున్నాయి. గ్రూప్ దశలో గత వారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ వర్షం వల్ల ఒక ఇన్నింగ్స్ తర్వాత రద్దయింది. నేటి మ్యాచ్ కూ వర్షం ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆట మొదలవనుండగా.. ఈ రోజు కొలంబోలో వర్షం కురిసే 90 శాతం వరకూ ఉంది. ఒకవేళ వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగినా.. ఈ రోజు జరకపోయినా రిజర్వ్ డే అయిన రేపు ఆడిస్తారు.
కాగా, ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ ముందుగానే తమ తుది జట్టును ప్రకటించింది. సూపర్4 రౌండ్ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ పైన ఆడిన జట్టునే కొనసాగించింది. మరోవైపు భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగే అవకాశాలున్నాయి. గాయం నుంచి కోలుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టులో చేరాడు. భార్య ప్రసవం కారణంగా నేపాల్ తో మ్యాచ్ కు దూరమైన పేసర్ బుమ్రా తిరిగి జట్టులో కలిశాడు. ఇషాన్ కిషన్ స్థానంలో రాహుల్.. షమీ లేదా శార్దూల్ స్థానంలో బుమ్రా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.