Sajjala Ramakrishna Reddy: ఈ కుంభకోణానికి రూపకర్త, నిర్మాత, దర్శకుడు అన్నీ చంద్రబాబే: సజ్జల
- స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు రిమాండ్
- సజ్జల మీడియా సమావేశం
- చంద్రబాబుకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని వెల్లడి
- అందుకే అరెస్ట్ చేశారని స్పష్టీకరణ
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కుంభకోణానికి రూపకర్త, నిర్మాత, దర్శకత్వం అన్నీ చంద్రబాబేనని ఆరోపించారు. ఈ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉన్నందునే నిన్న అరెస్ట్ చేశారని సజ్జల స్పష్టం చేశారు.
ఏడాదిన్నర కిందట ఈ కేసు దర్యాప్తు మొదలైందని, తీగ లాగితే డొంక కదిలిందని అన్నారు. చేసిన నేరానికి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా చంద్రబాబు కుమారుడు, దత్తపుత్రుడు వ్యహరించారని సజ్జల విమర్శించారు.
"ఇవాళ చంద్రబాబును రిమాండ్ కు పంపడం అనేది పెద్ద విషయం అని మేం భావించడంలేదు. దర్యాప్తు ప్రక్రియలో అదొక భాగం. ఇందులో ఆరోపణలు రుజువు చేయాల్సి ఉంది. ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి నేరారోపణ రుజువవుతుంది. అరెస్ట్ సమయంలో ఏదో జరగబోతోందని టీడీపీ వాళ్లు డ్రామాలు చేశారు. రూ.370 కోట్ల ప్రభుత్వ సొమ్మును నేరుగా షెల్ కంపెనీలకు పంపించారు. ఆ సొమ్ము అక్కడ్నించి మళ్లీ చంద్రబాబు వద్దకు చేరింది.
స్కిల్ డెవలప్ మెంట్ సంస్థను చంద్రబాబు పూర్తిగా తన కిందనే పెట్టుకున్నాడు. సీఎస్, ఆర్థిక కార్యదర్శి తదితర అధికారులు కూడా సీఎం చెబితేనే చేశామని స్పష్టంగా చెప్పారు. ఇంత భారీ కుంభకోణం జరిగింది.
ఇదంతా ఒకెత్తయితే.... నిన్న సొంత కొడుకు కంటే దత్తకొడుకు వీరంగం ఎక్కువైపోయింది. తన ఇంట్లో పడుకున్నట్టు జగ్గయ్యపేట రోడ్డుపై కాలుమీద కాలేసుకుని విలాసంగా పడుకున్నాడు.
ఇక, ఉదయం ఈనాడు పత్రిక చూస్తే రామోజీరావు ఏదేదో రాసేశాడు. తాలిబన్లు అంటాడు, చెడ్డీ గ్యాంగ్ అంటాడు... ఈనాడు భాషలో ఉన్న బూతులన్నీ రాసేశారు. చంద్రబాబునే టచ్ చేస్తారా అని రాశారు. టచ్ చేస్తే చంద్రబాబునే చేయాలి. ఎందుకుంటే 45 ఏళ్లుగా ఆయన స్కాంలు చేస్తున్నారు. ఎప్పుడైనా 10 అడుగులన్నా సక్రమంగా వేశారా? వ్యవస్థలను మేనేజ్ చేయడం, కోర్టుల్లో స్టేలు తెచ్చుకోవడం ద్వారా ఇన్నాళ్లుగా కొనసాగుతున్నాడు.
నిన్న కూడా డ్రామా చేశాడు. పెద్దాయన, మాజీ ముఖ్యమంత్రి కావడంతో హెలికాప్టర్ ఏర్పాటు చేశాం. కానీ పబ్లిసిటీ కోసం ఉహూ అన్నాడు. నిన్న విచారించిన డీఐజీ కూడా మామూలుగానే వ్యవహరించాడు. అవతలున్నది మాజీ సీఎం కావడంతో ఎందుకులే అనుకుని ఉండొచ్చు. కానీ ఆయన కొడుకు ఓ సీఐని మాట్లాడింది మామూలు బూతులా? మాజీ సీఎం కొడుకు అని గౌరవిస్తే, వాళ్ల పాలేర్లు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా జగన్ ధైర్యంగా నిలబడ్డారు. జగన్ కు ఇతరులకు చాలా తేడా ఉంది" అంటూ సజ్జల పేర్కొన్నారు.