Chandrababu: చంద్రబాబుకు ఖైదీ నెం 7691, జైల్లో సాధారణ దుస్తులు ధరించేందుకు అనుమతి
- ఆదివారం అర్ధరాత్రి చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
- అధికారిక లాంఛనాల అనంతరం జైలు అధికారులకు అప్పగింత
- జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక గది, ఆహారం, ఔషధాలు.
- మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు జైలు దుస్తులకు బదులు సాధారణ దుస్తులు ధరించేందుకు అనుమతి
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్డు జ్యూడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆయనను ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించారు. జైలు అధికారులు ఆయనకు రిమాండ్ ఖైదీ నెంబర్ 7691ను కేటాయించారు.
టీడీపీ అధినేతకు న్యాయస్థానం ఈ నెల 22 వరకూ రిమాండ్ విధించింది. ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కాన్వాయ్ వెంట రాగా ఆయనను పోలీసులు జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్‌జీ భద్రతా సిబ్బంది కూడా ఆయనను అనుసరించారు. మార్గమధ్యంలో ఓ వాహనం బ్రేక్ డౌన్ కాగా దాన్ని పక్కన పెట్టేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకూ చంద్రబాబు ప్రయాణించే మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఆదివారం అర్ధరాత్రి చంద్రబాబు కాన్వాయ్ జైలుకు చేరుకుంది. అధికారిక లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం పోలీసులు ఆయనను జైలు అధికారులకు అప్పగించారు. జైల్లో అధికారులు చంద్రబాబుకు ప్రత్యేక గది కేటాయించడంతో పాటూ కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఆహారం, అవసరమైన మందులు ఇతర వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అయినందున ఖైదీ దుస్తులకు బదులు సాధారణ దుస్తులు ధరించేందుకు అనుమతించారు. అప్పటివరకూ చంద్రబాబు వెంట వచ్చిన ఆయన తనయుడు లోకేశ్ అధికారుల అనుమతితో జైల్లో కాసేపు చంద్రబాబుతో మాట్లాడి వచ్చేశారు.