Chandrababu: చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు.... హౌస్ రిమాండ్ అవసరంలేదు: ఏపీ సీఐడీ
- చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
- హౌస్ రిమాండ్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు న్యాయవాదులు
- కౌంటర్ దాఖలు చేసిన ఏపీ సీఐడీ
- సీఆర్పీసీలో హౌస్ రిమాండ్ అనేదే లేదని స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆయన న్యాయవాదులు నిన్న హౌస్ రిమాండ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. అరెస్ట్ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయనకు హౌస్ రిమాండ్ అవసరంలేదని స్పష్టం చేసింది. చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఉంటుందని వెల్లడించింది.
పైగా, సీఆర్పీసీలో హౌస్ రిమాండ్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదని పేర్కొంది. బెయిల్ లభించని కారణంగానే హౌస్ రిమాండ్ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఏపీ సీఐడీ తన కౌంటర్ లో ఆరోపించింది.
అటు, ఏపీ సీఐడీ కస్టడీ పిటిషన్ పై విచారణను ఈ మధ్యాహ్నం తర్వాత కొనసాగించనున్నారు. ఏపీ సీఐడీ తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు.