YSRCP: కేసుతో సంబంధంలేని కొందరు న్యాయవాదులమంటూ కోర్ట్ హాల్‌లోకి ప్రవేశించారు: వైసీపీ
- స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్
- టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్ తీవ్రం
- అరెస్ట్ ద్వారా చంద్రబాబు ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం చేశాడన్న వైసీపీ
- జడ్జి తన చాంబర్ లో వాదనలు వింటానంటే చంద్రబాబు ఒప్పుకోలేదని వెల్లడి
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్ మరింత ముదిరింది. తాజాగా, సోషల్ మీడియాలో వైసీపీ విమర్శనాస్త్రాలు సంధించింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తన అరెస్ట్ ను రాజకీయం చేసి ప్రజల్లో సానుభూతి పొందాలని చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశాడని వెల్లడించింది.
చంద్రబాబు వయసును దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తి తన చాంబర్ లో వాదనలు వింటానంటే, అందుకు చంద్రబాబు, ఆయన బృందం ఒప్పుకోలేదని ఆరోపించింది. దానికితోడు నినాదాలు చేశారని వివరించింది. ఓపెన్ కోర్టులోనే వాదనలు వినాలని ఆయన న్యాయవాదులు పట్టుబట్టారని వైసీపీ వెల్లడించింది. అంతేకాకుండా, ఈ కేసుతో సంబంధం లేని కొందరు న్యాయవాదులమంటూ కోర్టు హాల్లోకి ప్రవేశించారని ఆరోపించింది.
"చంద్రబాబు అరెస్ట్ ను అడ్డుకునేందుకు ఆయన న్యాయవాదులు చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. సమయాన్ని సాగదీసేలా వరుసగా పిటిషన్లు వేశారు. న్యాయమూర్తి రిమాండ్ విధించినా జైలుకు తరలించకుండా అడ్డుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేశారు. కానీ వాటన్నింటిని ఛేదించిన సీఐడీ అధికారులు చంద్రబాబును రాజమండ్రి కేంద్ర కారాగానికి తరలించారు" అని వైసీపీ తన పోస్టులో వివరించింది.