Chandrababu: చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా
- ఇరువైపుల వాదనలను మూడు విడతలుగా విన్న ఏసీబీ న్యాయస్థానం
- సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు
- చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ లూథ్రా
- మంగళవారం ఉత్తర్వులు ఇస్తామని తెలిపిన ఏసీబీ కోర్టు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హౌస్ రిమాండ్ పిటిషన్‌పై తీర్పును ఏసీబీ కోర్టు రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై నేడు మూడు విడతలుగా న్యాయస్థానం వాదనలు వింది. ఇరువైపుల న్యాయవాదులు తమతమ వాదనలను బలంగా వినిపించారు. వాదనలు విన్న ఏసీబీ కోర్టు మంగళవారం ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. హౌస్ రిమాండ్ పిటిషన్‌పై సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. లంచ్ బ్రేక్‌కు ముందు, లంచ్ బ్రేక్ అనంతరం గం.4.30 తర్వాత, తిరిగి సాయంత్రం ఆరు తర్వాత... మూడు విడతలుగా వాదనలు జరిగాయి.
చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే సెక్యూరిటీ ఉంటుందని, హౌస్ రిమాండ్‌లో ఉంటే సాక్ష్యాలు తారుమారు చేస్తారని, జైల్లో కూడా పూర్తిస్థాయి సెక్యూరిటీని కల్పించామంటూ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అత్యవసరమైతే వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
మరోవైపు, చంద్రబాబుకు జైల్లో ప్రమాదం ఉందని, ఆయనకు ఇప్పటి వరకు ఎన్ఎస్జీ భద్రత ఉందని, కానీ ఇప్పుడు జైల్లో కల్పించిన భద్రతపై అనుమానాలు ఉన్నాయని సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.
ఇరువైపుల వాదనలు విన్న అనంతరం రాజమండ్రి కేంద్రకారాగారంలో భద్రతపై మరింత వివరణ కావాలని చంద్రబాబు తరఫు న్యాయవాది లూథ్రాను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కోరారు. సాయంత్రం ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ న్యాయమూర్తి రేపు తీర్పు ఇస్తామని తెలిపారు. మరోవైపు, ఇరువర్గాల న్యాయవాదులను రేపు కోర్టుకు రావాలని న్యాయమూర్తి ఆదేశించారు.