Team India: మళ్లీ మొదలైన మ్యాచ్... మరో మూడు వికెట్లు కోల్పోయిన పాక్
- కొలంబోలో ఆసియా కప్ మ్యాచ్
- భారత్ 50 ఓవర్లలో 2 వికెట్లకు 356 పరుగులు
- 24 ఓవర్లలో 5 వికెట్లకు 96 పరుగులు చేసిన పాక్
భారత్, పాక్ సూపర్-4 మ్యాచ్ జరుగుతున్న కొలంబోలో వరుణుడు శాంతించాడు. మ్యాచ్ మళ్లీ మొదలైంది. అయితే, భారత బౌలర్ల దూకుడు కొనసాగుతోంది. 357 పరుగుల భారీ లక్ష్యం ఛేదించేందుకు బరిలో దిగిన పాక్ సగం ఓవర్లు గడవకముందే 5 కీలక వికెట్లు చేజార్చుకుంది.
వర్షం వల్ల ఆటకు అంతరాయం కలగ్గా, అప్పటికే 2 వికెట్లు కోల్పోయిన పాక్... వర్షం తర్వాత మళ్లీ మ్యాచ్ మొదలవగా మరో మూడు వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లు ఫకార్ జమాన్ 27, ఇమామ్ ఉల్ హక్ 9 పరుగులు చేయగా... కెప్టెన్ బాబర్ అజామ్ 10, మహ్మద్ రిజ్వాన్ 2 పరుగులు చేసి పాక్ అభిమానులను నిరాశపరిచారు.
బాబర్ అజామ్ ను హార్దిక్ పాండ్యా అవుట్ చేసిన తీరు చూసి తీరాల్సిందే. పాండ్యా విసిరిన అద్భుతమైన ఇన్ కట్టర్ బాబర్ డిఫెన్స్ ను ఛేదించుకుంటూ వెళ్లి వికెట్లను తాకింది. ఆ బంతి ఎలా వచ్చిందో అర్థంకాని రీతిలో ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన పాక్ కెప్టెన్... అదే ఫీలింగ్ తో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత ఆగా సల్మాన్ (23) పోరాడినా అది కాసేపే అయింది. అతడిని కుల్దీప్ యాదవ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో పాక్ ఐదో వికెట్ కోల్పోయింది.
ప్రస్తుతం పాక్ స్కోరు 24 ఓవర్లలో 5 వికెట్లకు 96 పరుగులు. క్రీజులో ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్ ఉన్నారు. కుల్దీప్ యాదవ్ 2, బుమ్రా 1, పాండ్యా 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు.