Bhuma Akhila Priya: చంద్రబాబు అరెస్ట్ అంటే గొప్ప పని అనుకుంటున్నారేమో... అది మీ అంతం!: భూమా అఖిలప్రియ

Bhuma Akhila Priya on chandrababu arrest

  • జగన్ మార్పు తీసుకువస్తారని ఓటేస్తే ఉన్న ఉద్యోగాలు పోతున్నాయన్న అఖిలప్రియ
  • వారిని రౌడీలుగా, గూండాలుగా మార్చి, జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శ
  • చంద్రబాబు వయస్సుకు కూడా మర్యాద ఇవ్వలేదని ఆగ్రహం
  • పోలీసులు మనసు చంపుకొని చంద్రబాబును అరెస్ట్ చేశారని వ్యాఖ్య
  • ప్రజలు గుర్తు పెట్టుకుంటారు... వైసీపీకి డిపాజిట్లు రావన్న మాజీ మంత్రి

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్, కస్టడీ నేపథ్యంలో ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోమవారం ఓ వీడియోను విడుదల చేశారు. రాష్ట్రానికి ఏం దౌర్భాగ్యం పట్టిందో కానీ ఇలాంటిది (అరెస్ట్) చూడాల్సి వచ్చిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు. నేడు బంద్ సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా మద్దతిచ్చారన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. 

చంద్రబాబు కంటే జగన్ ఇంకా ఎక్కువ మార్పు తీసుకువచ్చి, యువతకు ఉద్యోగాలు తీసుకువస్తారని భావించి 2019లో ఓటేశారని, కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయన్నారు.

వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను రౌడీలుగా, గూండాలుగా మార్చి, వారి జీవితాలతో ఆడుకుంటున్నారని దుయ్యబట్టారు. రాయలసీమకు న్యాయరాజధాని తీసుకువస్తామని చెప్పి మోసం చేశారన్నారు. వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి సహా ఆ పార్టీ నాయకులు కక్ష సాధింపులు, వారి కుటుంబ ఆస్తులు పెంచుకోవడం పైనే దృష్టి సారించినట్లుగా కనిపిస్తోందన్నారు. 

చంద్రబాబు అరెస్ట్ అంటే గొప్పపని అన్నట్లుగా మీడియా ముందుకు వస్తున్నారని, కానీ అది మీ అంతం అని తెలుసుకోవాలన్నారు. ప్రజలు మీకు ది ఎండ్ అని ఇవ్వబోతున్నారు... వైసీపీ నాయకులకు ఇక రాజకీయ భవిష్యత్తు లేదు, ప్రజలు మిమ్మల్ని చరిత్రహీనులుగా చూస్తారన్నారు.

చంద్రబాబు వయస్సుకు కూడా మర్యాద ఇవ్వలేదన్నారు. డెబ్బై మూడేళ్లు ఉన్న రాజకీయ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేయడం విడ్డూరమన్నారు. మమ్మల్ని అడ్డుకునేవారు లేరనే విధంగా విర్రవీగుతున్నారని, కనీసం గవర్నర్ సంతకం కూడా లేకుండా అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యే సమయంలో తాము కళ్లారా చూశామన్నారు. నంద్యాల ప్రోగ్రాం పూర్తయ్యాక ఆయన అలసిపోయి పడుకుంటే, అర్ధరాత్రి రెండు గంటలకు ఆయనను లేపి, తెల్లవారుజామున తీసుకు వెళ్లారన్నారు. ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

ఒకప్పుడు వైసీపీ ఉండేది అనే స్థాయికి తీసుకువస్తున్నారన్నారు. వైసీపీ జెండా పట్టుకున్న చాలామంది కూడా ఈ అరెస్ట్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారన్నారు. పోలీస్ డిపార్టుమెంటులో చాలామంది తమ మనసును చంపుకొని, ఉన్నతాధికారుల ఒత్తిడితో అరెస్ట్ చేయడానికి ముందుకు వచ్చారన్నారు. పోలీస్ డిపార్టుమెంట్‌లో ఒకరిద్దరు అత్యుత్సాహం చూపించి ఉండవచ్చు... కానీ మిగతావారంతా బాధపడుతున్నారన్నారు.

తాము అధికారంలోకి వస్తే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని చెప్పిన వైసీపీ... కనీసం స్పెషల్ టీ కూడా కేంద్రాన్ని అడగలేకపోతోందని విమర్శించారు. కేవలం కేసులకు భయపడి కేంద్రం ఆడించినట్లుగా ఆడుతోందన్నారు. టీడీపీపై కక్ష సాధింపు చర్యలు మాత్రమే వైసీపీ లక్ష్యమన్నారు. ఎప్పుడూ టీడీపీని తిట్టడం, అక్రమ కేసులు పెట్టడం తప్ప అభివృద్ధిపై మాట్లాడారా? నిధులు తీసుకు వచ్చిన విషయాలు చెప్పారా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు బయటకు వస్తే... మరిన్ని కేసులు పెట్టి, మళ్లీ మళ్లీ జైలుకు పంపించాలని రోజా, ఇతర మంత్రులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా దానికి వెయ్యి రెట్ల బలంతో, కసితో ఆయన ముందుకు వస్తారన్నారు. తమ పార్టీ అధినేతతో కలిసి ముందుకు నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకులకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబును అరెస్ట్ చేశాక, తండ్రిని చూసేందుకు వెళ్లిన లోకేశ్‌ను అడ్డుకున్నారన్నారు. వైసీపీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో మానవత్వాన్నే చంపేసిందన్నారు. చంద్రబాబును జైలుకు పంపించేంత వరకు మీరు చేసిన అక్రమాలు, పాపాలు, అన్యాయాలు ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారని, వైసీపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. బంద్‌కు సహకరించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News