Mumbai: ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనుకుంటున్నారు.. దానికిదే నిదర్శనం.. మహారాష్ట్ర కాంగ్రెస్ సంచలన ఆరోపణ
- ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
- ఎజెండా ప్రకటించకపోవడంతో ఊహాగానాలు
- ముంబై నుంచి పవర్‌హౌస్‌లను తరలించేస్తున్నారన్న కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్
- ముంబై స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లను గుజరాత్‌కు తరలిస్తున్నారన్న నానా పటోలే
- గత ప్రభుత్వం అందుకు అడ్డుపడిందనే కూల్చేశారన్న కాంగ్రెస్ చీఫ్
ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనుకుంటున్నారంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే మహారాష్ట్ర నుంచి ముంబైని వేరు చేయాలని ప్లాన్ చేశారని ఆయన ఆరోపించారు. కరోనా సమయంలో కానీ, నోట్ల రద్దు విషయంలో కానీ, తాజాగా మణిపూర్ హింస విషయంలో కానీ ప్రధాని ఎప్పుడూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించలేదన్న ఆయన.. ఇప్పుడు నిర్వహిస్తుండడం వెనక చాలా పెద్ద ప్రణాళిక ఉందని, ముంబైని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి రాష్ట్రం నుంచి వేరుచేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రకటించిన కేంద్రం ఎజెండాను ప్రకటించకపోవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. ‘‘ముంబై అంతర్జాతీయ నగరం. దేశ ఆర్థిక రాజధాని. ఎయిర్ ఇండియా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్, డైమండ్ మార్కెట్ వంటి వాటిని ముంబై నుంచి తరలించేస్తున్నారు’’ అని నానా పటోలే ఆరోపించారు. అంతేకాదు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లను కూడా గుజారత్‌కు తరలించే యోచనలో కేంద్రం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి పనులకు గత మహా వికాశ్ అఘాడీ ప్రభుత్వం ప్రధాన అడ్డంకిగా మారడంతోనే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టారని ఆయన ఆరోపించారు.