Chandrababu: ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు
- హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన చంద్రబాబు తరపు లాయర్లు
- చంద్రబాబు తరపున మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ పిటిషన్
- ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. మరోవైపు ఏసీబీ కోర్టు రిమాండ్ ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఆయన తరపు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
చంద్రబాబు తరపున మాజీ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ పిటిషన్ వేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని పిటిషన్ లో పేర్కొన్నారు. గవర్నర్ అనుమతి లేకుండానే ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పిటిషన్ పై రేపు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.