Khalistan: కెనడాలోని భారత ఎంబసీని మూసేయండి.. ఖలిస్థాన్ గ్రూప్ హెచ్చరిక

Khalistan Group Warning Call To India

  • ఆ దేశ ప్రధాని ట్రూడో ఢిల్లీలో ఉండగానే బెదిరింపు ఫోన్ కాల్
  • హై కమిషనర్ ను వెనక్కి పిలిపించుకోవాలని వార్నింగ్
  • 48 గంటల్లో రెండో బెదిరింపు కాల్.. మీడియా వర్గాల సమాచారం

ఓవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఢిల్లీలో ఉన్నారు.. అయినా కెనడాలోని ఖలిస్థానీ వేర్పాటువాదుల దుశ్చర్యలు ఆగడంలేదు. ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశారు. భారత రాయబారిని వెంటనే వెనక్కి పిలిపించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని బెదిరించారు. ఈమేరకు కెనడా నుంచి మంగళవారం బెదిరింపు కాల్ వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గడిచిన 48 గంటల్లో ఇలా బెదిరింపు కాల్ రావడం ఇది రెండోసారి అని పేర్కొన్నాయి. జీ20 సదస్సులో భాగంగా ట్రూడోతో భేటీ అయిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశంలో ఖలిస్థానీ గ్రూపుల దుశ్చర్యలను ఖండించారు. 

వేర్పాటువాదుల అరాచకాలను తిప్పికొట్టాలని, ఖలిస్థానీ గ్రూపును అణచివేయాలని సూచించారు. ఈ విషయంపై ప్రధాని మోదీ కెనడా ప్రధాని వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే, కొంతమంది వ్యక్తులు చేసిన పనులను మొత్తం దేశానికి ఆపాదించకూడదని ట్రూడో పేర్కొనట్లు సమాచారం. మోదీ- ట్రూడో సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత ఖలిస్థానీ గ్రూప్ నుంచి ఈ బెదిరింపు కాల్ వచ్చింది. భారత పర్యటనలో ట్రూడో ఇబ్బందిగా కనిపించడానికి మోదీ సర్కారు వైఖరే కారణమని టెర్రర్ గ్రూపు ఆరోపించింది. దీనిపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఖలిస్థానీ ఆందోళనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే పలుమార్లు కెనడాకు విజ్ఞప్తి చేసినా.. కెనడా ప్రభుత్వం మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోందని కేంద్రం విమర్శించింది. తాజా బెదిరింపుల కాల్స్ తో కెనడాలోని మిలిటెంట్ గ్రూపులపై భారత్ చేస్తున్న వాదనలు నిజమేనని తేలిపోయిందని పేర్కొంది. బెదిరింపు కాల్స్ విషయంలో కెనడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం  చేసింది.

  • Loading...

More Telugu News