asia cup: డిజిటల్ హిస్టరీలో అదిరిపోయే రికార్డు సృష్టించిన భారత్–పాక్ మ్యాచ్
- డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం
- ఏకకాలంలో 2.80 కోట్ల వ్యూయర్‌షిప్ సొంతం
- 2019 వన్డే ప్రపంచ కప్ లో భారత్–న్యూజిలాండ్ సెమీస్ రికార్డు బ్రేక్
ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకలోని కొలంబో వేదికగా రెండు రోజుల పాటు సాగిన భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అభిమానులను అలరించింది. ఇందులో అద్భుత ప్రదర్శన చేసిన భారత్ 228 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. వన్డేల్లో పరుగుల పరంగా పాక్‌పై అతి పెద్ద విజయంతో రికార్డు సృష్టించింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు జరిగినప్పటికీ ఈ మ్యాచ్ కోసం అభిమానులు టీవీల ముందు వాలిపోయారు. దాంతో, వ్యూయర్‌షిప్‌లో రికార్డులు బద్దలయ్యాయి. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ తో పాటు డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం అయింది.
ఈ మ్యాచ్‌ను ఏకకాలంలో రెండు కోట్ల 80 లక్షల మంది వీక్షించారు. డిజిటల్ చరిత్రలో భారత్ ఏ మ్యాచ్‌కైనా ఇదే అత్యధిక వ్యూయర్‌షిప్. గతంలో 2019 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్–న్యూజిలాండ్ మ్యాచ్ ను 2.52 కోట్ల మంది వీక్షించారు. నాలుగేళ్లుగా చెక్కుచెదరని ఈ రికార్డును ఆసియా కప్ లో భారత్–పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్ బద్దలు కొట్టింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.