- చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్ధమన్న అఖిలేశ్ యాదవ్
- ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం ట్రెండ్ గా మారిందని వ్యాఖ్య
- స్వార్థపూరితమైన బీజేపీ ఏ పార్టీకి మిత్రుడు కాదని విమర్శ
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తొలుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ ను ఆమె తప్పుపట్టారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన తీరు సరికాదని అన్నారు. తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందించారు.
ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడమనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు ట్రెండ్ గా మారిందని అఖిలేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్ధమని, అరెస్ట్ ను ఖండిస్తున్నానని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వారిని జైల్లో పెట్టడం నిరంకుశ పాలనకు నిదర్శనమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావు లేదని అన్నారు. ఇలాంటి వాటికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని బీజేపీ, ఆ పార్టీకి అవకాశవాద స్నేహితులుగా ఉన్న వారు గుర్తుంచుకోవాలని చెప్పారు. స్వార్థపూరితమైన బీజేపీ మరే పార్టీకి మిత్రుడు కాదని అన్నారు. చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు.
అంతేకాదు, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అఖిలేశ్ యాదవ్ ఫోన్ చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలుసుకున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడతానని చెప్పారు.