Team India: నిన్నటి జోరు ఇవాళ లేదు... శ్రీలంకపై ఓ మోస్తరు స్కోరు చేసిన భారత్
- ఆసియా కప్ సూపర్-4లో నేడు భారత్ × శ్రీలంక
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- 49.1 ఓవర్లలో 213 పరుగులకు భారత్ ఆలౌట్
- 5 వికెట్లు తీసిన వెల్లాలగే... 4 వికెట్లు పడగొట్టిన అసలంక
శ్రీలంక జట్టుతో కొలంబోలో జరుగుతున్న ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ లో టీమిండియా స్వల్ప స్కోరుతోనే సరిపెట్టుకుంది. నిన్న పాకిస్థాన్ పై అర్ధసెంచరీలు, సెంచరీలతో జూలువిదిల్చిన భారత బ్యాట్స్ మెన్ ఇవాళ పరుగుల కోసం చెమటోడ్చారు. శ్రీలంక స్పిన్ దాడులతో విజృంభించగా... వికెట్లు కాపాడుకోవడానికి భారత బ్యాటర్లు విఫల యత్నాలు చేశారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ చివరికి 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. చివర్లో వర్షం అంతరాయం కలిగించినా, కొద్దిసేపటి తర్వాత మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది.
యువ లెఫ్టార్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లాలగే 5 వికెట్లతో భారత్ పతనంలో కీలక భూమిక పోషించాడు. మరో స్పిన్నర్ చరిత్ అసలంక 4 వికెట్లతో భారత లోయరార్డర్ పనిబట్టాడు. మిస్టరీ స్పిన్నర్ తీక్షణకు ఓ వికెట్ దక్కింది.
టీమిండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధసెంచరీ చేయగా, ఇషాన్ కిషన్ 33, కేఎల్ రాహుల్ 39 పరుగులు చేశారు. చివర్లో అక్షర్ పటేల్ 26 పరుగులు సాధించాడు. వీళ్లు మినహా మరెవ్వరూ రాణించలేదు.