Daggubati Purandeswari: దీని వల్లే ఇన్నేళ్లయినా ఏపీలో బీజేపీ ఎదగలేకపోయింది: పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
- పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాల వల్లే ఏపీలో బీజేపీ ఎదగలేకపోయిందన్న పురందేశ్వరి
- ఇకపై ప్రతి ఒక్కరూ పార్టీ కోసమే పని చేయాలని సున్నిత హెచ్చరిక
- పోలింగ్ బూత్ స్థాయి వరకు పార్టీ కమిటీలను వేయాల్సిందేనని వ్యాఖ్య
ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలను స్వీకరించిన పురందేశ్వరి క్రమంగా దూకుడు పెంచుతున్నారు. పార్టీపై కంట్రోల్ పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆమె పార్టీ నేతలకు, శ్రేణులకు సున్నితమైన హెచ్చరికలు జారీ చేశారు. పార్టీలో గ్రూపులకు తావులేదని... ఎవరూ కూడా గ్రూపులు కట్టే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాల వల్ల రాష్ట్రంలో ఇన్నేళ్లుగా బలపడలేకపోయామని ఆమె చెప్పారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇకపై పార్టీ కోసమే పని చేయాలని సూచించారు. అధికారంలోకి వస్తామనే ఆత్మవిశ్వాసంతో పని చేయాలని చెప్పారు.
మండల స్థాయిలో కూడా కమిటీలను వేసుకోకపోతే... పార్టీ ఎలా బలపడుతుందని పురందేశ్వరి ప్రశ్నించారు. పోలింగ్ బూత్ స్థాయి వరకు కమిటీలను వేసుకోవాల్సిందేనని చెప్పారు. జిల్లా స్థాయి కమిటీలు స్థానిక సమస్యలపై ప్రజల తరపున పోరాడాలని తెలిపారు. మోదీ ప్రభుత్వ విజయాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో పని చేసే కార్యకర్తలకు కూడా బాధ్యతలను అప్పగించినప్పుడే పార్టీ బలపడుతుందని చెప్పారు. సర్పంచ్ ల సమస్యలపై క్షేత్ర స్థాయిలో చేపట్టిన ఉద్యమం విజయవంతమయిందని... ఈ ఉద్యమం ద్వారా మన పార్టీ గొంతుకను బలంగా వినిపించామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి వచ్చే విరాళాలను నగదు రూపంలో తీసుకోవద్దని స్పష్టం చేశారు.