Kerala High Court: స్విగ్గీలు, జొమాటోలు పక్కన పెట్టి పిల్లలకు కమ్మగా వండిపెట్టండి: తల్లులకు కేరళ హైకోర్టు హితవు
- ఆరుబయట ప్రాంతాల్లో ఆడుకునేలా వారిని ప్రోత్సహించాలన్న న్యాయమూర్తి
- మైనర్లకు మొబైల్ ఫోన్ ఇవ్వొద్దంటూ తల్లిదండ్రులకు సూచన
- సరైన పర్యవేక్షణ లేకుండా పిల్లలకు ఫోన్ ఇస్తే ముప్పు తప్పదని హెచ్చరిక
‘పిల్లలను ఆరుబయట ప్రాంతాల్లో ఆడుకునేలా ప్రోత్సహించండి.. అలిసిపోయి ఇంటికి వచ్చే సమయానికి కమ్మగా వండి పెట్టండి’ అంటూ కేరళ హైకోర్టు న్యాయమూర్తి చిన్నారుల తల్లులకు సూచించారు. తల్లి చేతి వంటలోని ఆనందాన్ని పిల్లలు ఆస్వాదించేలా చూడాలని చెప్పారు. అంతేకానీ వారికి స్మార్ట్ ఫోన్ ఇచ్చి స్విగ్గీలు, జొమాటోలలో ఆర్డర్ పెట్టుకునేలా ప్రోత్సహించవద్దని చెప్పారు. మైనర్ల చేతికి సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్ ఇవ్వొద్దని, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే తరచూ గమనిస్తూ ఉండాలని చెప్పారు. సరైన పర్యవేక్షణ లేకుంటే పిల్లల చేతుల్లోని స్మార్ట్ ఫోన్ తో అనర్థాలు తప్పవని హెచ్చరించారు. ఈమేరకు ఓ కేసు విచారణలో భాగంగా కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రోడ్డు పక్కన తన ఫోన్ లో అశ్లీల వీడియోలు చూస్తున్న వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ హైకోర్టు ముందుకు వచ్చింది. వాదనలు విన్న తర్వాత ఈ కేసులో తీర్పు వెలువరిస్తూ జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అశ్లీల వీడియోలు, ఫొటోలు ఇతరులకు పంపించడం, బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడం నేరమేనని న్యాయమూర్తి చెప్పారు. అయితే, ఈ కేసులో సదరు వ్యక్తి తన ఫోన్ లో ప్రైవేటుగా పోర్న్ చూస్తున్నారే తప్ప ఇతరులకు పంపడం కానీ, ప్రదర్శించడం కానీ చేయలేదని అన్నారు. ఓ వ్యక్తి ప్రైవేటుగా అశ్లీల వీడియోలు చూడడం ఐపీసీ సెక్షన్ 292 కిందికి రాదని, దానిని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేశారు. పోలీసులు పెట్టిన ఈ కేసును జడ్జి కొట్టేశారు.