Vijayasai Reddy: సోము వీర్రాజు ఉంటే... 'బావ'సారూప్యత సమస్య ఉత్పన్నమయ్యేది కాదు: విజయసాయిరెడ్డి
- సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉండి ఉంటే పురందేశ్వరిలా అవినీతిపరులకు మద్దతు పలికేవారు కాదన్న విజయసాయి
- టీడీపీ బలహీనతను వీర్రాజు తన పార్టీకి అనుకూలంగా మార్చుకునేవారని వెల్లడి
- ఇండియా కూటమికి చంద్రబాబు దగ్గరవుతోన్న విషయం బీజేపీకి తెలుసన్న విజయసాయి
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై పురందేశ్వరి స్పందించిన తీరును వైసీపీ నేతలు తప్పుబట్టారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మరోసారి ఆమెను లక్ష్యంగా చేసుకుని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు.
సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే పురందేశ్వరిలా అవినీతిపరులకు మద్ధతు పలికేవారు కాదని, టీడీపీ బలహీనతను వీర్రాజు తన పార్టీకి అనుకూలంగా మార్చుకునేవారని ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే 'బావ'సారూప్యత సమస్య ఉత్పన్నమయ్యేది కాదని చురక అంటించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా చంద్రబాబు 'ఇండియా' (I.N.D.I.A.) కూటమికి దగ్గరవుతున్న విషయం బీజేపీ అధిష్ఠానానికి తెలుసునని వ్యాఖ్యానించారు.