Komatireddy Venkat Reddy: కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం పాలైంది: సీఎం కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ
- నెలలో సగం రోజులు గడిచినా ఉద్యోగుల జీతాలు రాలేదన్న కోమటిరెడ్డి
- తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని వెల్లడి
- అలాంటి ఉద్యోగులను కేసీఆర్ ఇబ్బందిపెడుతున్నాడని ఆగ్రహం
- కాంగ్రెస్ వచ్చాక ఒకటో తేదీనే జీతాలు వేస్తామని హామీ
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం పాలైందని విమర్శించారు. సగం నెల గడిచిపోయినా గానీ ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లు రాలేదని వెల్లడించారు. యువత కోసం కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడం మర్చిపోయిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడం కూడా మానేసిందని తెలిపారు.
ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న అన్నట్టుగా... తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులను నేడు చిన్నచూపు చూడడం సరైన పద్ధతి కాదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హితవు పలికారు. పెన్ డౌన్ చేసి, సకల జనుల సమ్మె చేసి, తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న రాష్ట్ర ఉద్యోగులు నేడు జీతాలు ఎప్పుడొస్తాయోనని ఎదురుచూడాల్సిన పరిస్థితి బాధాకరమని పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేదని... పీఆర్సీ, డీఏలను సమయానికి ఇచ్చేదని వెల్లడించారు. ఎన్నికలు సమీపిస్తుండడగంతో ఓఆర్ఆర్ టెండర్లు చేపట్టి, మద్యం దుకాణాలు వేలం వేసి, భూములు అమ్మి... బీసీ బంధు, దళిత బంధు అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలకే దోచిపెడుతున్నారు కానీ, ఉద్యోగులకు జీతం మాత్రం ఇవ్వడంలేదని కోమటిరెడ్డి తన లేఖలో విమర్శించారు. ఎవరైనా జీతాల గురించి ప్రశ్నిస్తే అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
మీరు అధికారంలో ఉండే ఈ రెండు నెలలైనా జీతం ఒకటో తారీఖునే ఇవ్వండి అని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తుందని, బకాయిలతో పాటు పీఆర్సీ కూడా చెల్లిస్తుందని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ తరహాలో తెలంగాణలోనూ సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేస్తామని తెలిపారు.