India: శరద్ పవార్ నివాసంలో I.N.D.I.A. కూటమి సమన్వయ కమిటీ భేటీ
- ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించాలని సమన్వయ కమిటీ నిర్ణయం
- అక్టోబర్ మొదటివారంలో భోపాల్లో మొదటి సభ నిర్వహించనున్న కూటమి
- పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, అవినీతిపై గళమెత్తాలని నిర్ణయం
I.N.D.I.A. కూటమి తొలి సమన్వయ కమిటీ సమావేశం ఈ రోజు ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగింది. ఈ భేటీకి 12 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. అక్టోబర్ మొదటి వారంలో భోపాల్లో మొదటి బహిరంగ సభ నిర్వహించనుంది. బీజేపీ పాలనలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, అవినీతిపై గళమెత్తాలని నిర్ణయించాయి. కులగణన అంశాన్ని చేపట్టాలని ఈ కమిటీ నిర్ణయించింది. అలాగే సీట్ల పంపకాలను నిర్ణయించేందుకు ఉద్ధేశించిన ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది.
ఈ సమావేశానికి హాజరైన వారిలో కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్), టీఆర్ బాలు (డీఎంకే), సంజయ్ రౌత్ (శివసేన-యూబీటీ), తేజస్వి యాదవ్ (ఆర్జేడీ), రాఘవ్ చద్దా (ఆమ్ ఆద్మీ పార్టీ), జావెద్ అలీఖాన్ (ఎస్పీ), సంజయ్ ఝా (జేడీ-యూ), డీ రాజా (సీపీఐ), ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) ఉన్నారు. ఈడీ విచారణ నేపథ్యంలో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ గైర్హాజరయ్యారు.