Nipah Virus: నీపా కలకలం.. రాష్ట్రంలో బంగ్లాదేశ్ వేరియంట్ ఉందన్న కేరళ ప్రభుత్వం

Nipah virus in kerala identified as bangladesh variant

  • కేరళలో బయటపడ్డ నీపా వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్ అని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం   
  • ఇప్పటివరకూ వెలుగుచూసిన ఐదు కేసుల్లో ఇద్దరి మృతి
  • బాధితులకు సన్నిహితంగా మెలిగిన వారికి వైద్య పరీక్షలు
  • వైరస్ తొలిసారిగా బయటపడ్డ కోజీకోడ్‌ జిల్లాలోని పలు గ్రామాలను ఐసోలేషన్ జోన్లుగా ప్రకటన
  • పొరుగున ఉన్న జిల్లాల్లోనూ హైఅలర్ట్

కేరళలో ఇద్దరి మరణాలకు కారణమైన నీపా వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్ అని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఇప్పటివరకూ రాష్ట్రానికి చెందిన ఐదుగురు ఈ వేరియంట్ బారినపడగా ఇద్దరు మృతిచెందారు. 

ఇక వైరస్ వ్యాప్తిని మొగ్గలోనే తుంచేసేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. వైరస్‌ తొలిసారిగా బయటపడ్డ కోజీకోడ్ జిల్లాలోని అటాన్‌చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కమిలుంపర గ్రామాలను కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అక్కడి బ్యాంకులు, విద్యాసంస్థలను మూసివేయడంతో పాటు పొరుగున ఉన్న కన్నూర్, వయనాడ్, మలప్పురం జిల్లా అధికారులను ప్రభుత్వం అలర్ట్‌లో ఉంచింది. ఈ వైరస్ బారినపడ్డ వారు మరణించే అవకాశం ఎక్కువగా ఉండటంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ బృందం కేరళకు బయలుదేరింది. 

కోజీకోడ్ జిల్లాలోని మెడికల్ కాలేజీలో మొబైల్ క్యాంపు ఏర్పాటు చేసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. దీంతోపాటూ 75 ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. కాగా, బుధవారం రాష్ట్రంలో మరో నీపా వైరస్ కేసు వెలుగు చూసింది. ఇక బాధితులతో సన్నిహితంగా మెలిగిన సుమారు 130 మందిని అధికారులు గుర్తించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని ఐసీఎంఆర్ ఎపిడమిక్ బృందాలు కోజీకోడ్‌లో సర్వే నిర్వహిస్తున్నాయి.

  • Loading...

More Telugu News