Mamata Banerjee: ప్రతిపక్ష కూటమికి నేతృత్వంపై మమతా బెనర్జీ ఏమన్నారంటే..!
- దుబాయ్ ఎయిర్ పోర్టులో శ్రీలంక అధ్యక్షుడితో దీదీ భేటీ
- ఇండియా కూటమిని మీరు లీడ్ చేస్తారా? అని అడిగిన రణిల్ విక్రమ సింఘే
- ప్రజల సహకారం ఉంటే రేపు అధికారం మాదేనన్న మమత
- దుబాయ్, స్పెయిన్ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
విదేశీ పర్యటనకు వెళ్లిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుబాయ్ ఎయిర్ పోర్టులో ఆసక్తికర ప్రశ్నను ఎదుర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై ‘ఇండియా’ పేరుతో కూటమిని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కూటమికి ఇప్పటి వరకు నాయకుడిని ఎన్నుకోలేదు. ఈ క్రమంలో ఇండియా కూటమికి మీరు నేతృత్వం వహిస్తారా? అంటూ శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘె ప్రశ్నించారు. దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో ఈ ఇద్దరు నేతలు అనుకోకుండా కలుసుకున్నారు. ఈ క్రమంలో విక్రమ సింఘె ఇండియా కూటమి గురించి మమతతో మాట్లాడారు.
శ్రీలంక అధ్యక్షుడి ప్రశ్నకు దీదీ జవాబిస్తూ.. ప్రజల సహకారం ఉంటే రేపు అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమేనని చెప్పారు. కూటమి నాయకత్వం వహించడంపై మాత్రం ఆమె జవాబు దాటవేశారు. కాగా, నవంబర్ లో కోల్ కతాలో జరగనున్న వాణిజ్య సదస్సుకు శ్రీలంక అధ్యక్షుడిని ఆహ్వానించినట్లు మమత చెప్పారు. శ్రీలంకలో పర్యటించాలంటూ విక్రమ సింఘె తనను పిలిచారని దీదీ వివరించారు. విక్రమ సింఘెతో ఎయిర్ పోర్టులో దిగిన ఫొటోను ఆమె తన ట్విట్టర్ హ్యాండిల్ లో పంచుకున్నారు.