Joe Biden: ప్రభుత్వాన్ని రద్దు చేయాలని రిపబ్లికన్ల కుట్ర: బైడెన్

Biden says Republicans want to shutdown his govt

  • తనపై అభిశంసన తీర్మానం ప్రచారంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు
  • ఇంపీచ్ మెంట్ ప్రచారం ఓ పొలిటికల్ స్టంట్ అని తేల్చేసిన వైట్ హౌస్
  • బైడెన్ కు వ్యతిరేకంగా రిపబ్లికన్ల దగ్గర ఆధారాలు లేవని వెల్లడి

అధ్యక్షుడు జో బైడెన్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారని అమెరికా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ప్రెసిడెంట్ జో బైడెన్ బుధవారం స్పందించారు. తన ప్రభుత్వాన్ని కూల్చేయాలని రిపబ్లికన్ నేతలు భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందులో భాగంగానే ఇంపీచ్ మెంట్ వార్తలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ వార్తలన్నీ ఫేక్ అంటూ వైట్ హౌస్ కొట్టిపారేసిన విషయాన్ని బైడెన్ ప్రస్తావించారు. తనపై అభిశంసన ఎందుకు పెట్టాలనుకుంటున్నారో తన ప్రత్యర్థులకే క్లారిటీ లేదన్నారు. రిపబ్లికన్ ప్రతినిధి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూటమికి చెందిన నేత మార్జోరి టేలర్ గ్రీనె గతంలో చేసిన వ్యాఖ్యలను బైడెన్ గుర్తుచేశారు.

చట్ట సభకు ఎన్నికైన వెంటనే తనపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారని అన్నారు. తనను దించేయడం తద్వారా ప్రభుత్వాన్ని రద్దు చేయడమే లక్ష్యంగా రిపబ్లికన్లు పనిచేస్తున్నారని బైడెన్ విమర్శించారు. అయితే, ఈ విషయంపై తాను ఎక్కువగా ఆలోచించనని, తనకు ఇతరత్రా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పారు. అంతకుముందు బైడెన్ ఇంపీచ్ మెంట్ వార్తలపై వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రచారం అంతా వట్టిదేనని, బైడెన్ కు వ్యతిరేకంగా రిపబ్లికన్లు ఎలాంటి ఆధారాలు చూపలేదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్ పియరె పేర్కొన్నారు. ఇదంతా పొలిటికల్ స్టంట్ గా పియరె కొట్టిపారేశారు.

  • Loading...

More Telugu News