Google: రిక్రూటర్లపై వేటు వేసిన గూగుల్
- వందలాది మందిని తొలగిస్తున్నట్టు సమాచారం
- కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదన్న గూగుల్
- వ్యయాలు తగ్గించుకుని, లాభాలు పెంచుకునే చర్యలు
గూగుల్ మరో విడత ఉద్యోగులపై వేటు వేసింది. ఈ సారి రిక్రూటర్లపై చర్యలు తీసుకుంది. విధుల నుంచి తొలగిస్తున్నట్టు వందలాది మంది రిక్రూటర్లకు బుధవారం గూగుల్ సమాచారం ఇచ్చింది. గూగుల్ రిక్రూటింగ్ గ్రూప్ లో ఒకానొక సమయంలో 3,000 మంది పనిచేస్తుండగా, తొలగింపులతో ఈ సైజు తగ్గుతూ వస్తోంది. తాజా పరిణామాలను చూస్తుంటే ఈ తొలగింపులు ఇక ముందూ కొనసాగుతాయనే అనుమానాలు నెలకొన్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై గూగుల్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండగా, మరోవైపు ఈ వరుస తొలగింపు చర్యలను చూస్తుంటే వ్యయ నియంత్రణ చర్యలను అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. మానవ వనరులను మరింత పొదుపుగా వినియోగించే యోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది.