Bandi Sanjay: వైసీపీ తన గోతిలో తానే పడుతుంది.. ఆ పార్టీకి ఒక దరిద్రపు అలవాటు ఉంది.. బాబుకు మైలేజ్ పెరిగింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Chandrababu arrest is big minus for YSRCP says Bandi Sanjay

  • చంద్రబాబు అరెస్ట్ వైసీపీకి మైనస్ అన్న బండి సంజయ్
  • బాబు అరెస్ట్ ను అన్ని పార్టీలు ఖండించాయని వ్యాఖ్య
  • వైసీపీ నేతలు నీతిమంతులా? అని ప్రశ్న

టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే రాజకీయంగా కొట్లాడాలే తప్ప, ఇలాంటి కక్ష సాధింపులకు పాల్పడకూడదని విమర్శించారు. చంద్రబాబును టార్గెట్ చేసే అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. మాజీ సీఎం అరెస్ట్ విషయంలో కనీస రూల్స్ కూడా పాటించలేదని మండిపడ్డారు. 

వైసీపీ నేతలకు ఒక దరిద్రపు అలవాటు ఉందని... ఇలా నిజాలు మాట్లాడితే తనను కూడా చంద్రబాబు ఏజెంట్ లేదా పవన్ కల్యాణ్ ఏజెంట్ అంటారని సంజయ్ దుయ్యబట్టారు. వైసీపీ వాళ్లే సుద్దపూసలు అన్నట్టు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు నీతిమంతులా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని... కక్షపూరితంగా అరెస్ట్ చేశారనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ వైసీపీకి చాలా మైనస్ అని... వాళ్లు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడతారని అన్నారు. 

ఇప్పుడు చంద్రబాబుకు భారీగా మైలేజ్ పెరిగిందని... ఎక్కడకు పోయినా వైసీపీ ప్రభుత్వం తప్పు చేసిందని అంటున్నారని సంజయ్ చెప్పారు. ఇలాంటి అరెస్ట్ తప్పని అందరూ అంటున్నారని తెలిపారు. తప్పు చేసిన వాళ్లను అరెస్ట్ చేయాల్సిందేనని, శిక్ష పడాల్సిందేనని, అయితే చంద్రబాబును కక్ష పూరితంగా అరెస్ట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తోందని... పార్టీలు, రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు కూడా దీనిపై స్పందిస్తున్నారని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నాయని తెలిపారు.

రాజకీయ పార్టీలు, ప్రజలు తప్పు అంటున్నప్పుడు... వైసీపీ ప్రభుత్వం తప్పును గ్రహించి, దాన్ని సరిదిద్దుకుంటే వాళ్లకే మైలేజ్ వస్తుందని సూచించారు. చంద్రబాబును జైల్లోనే ఉంచుతాం, బయటకు రానీయం అని అంటే... ప్రజలు హర్షించరని, ఎందుకు బయటకు రానీయరని ఎన్నికల సమయంలో ప్రశ్నిస్తారని చెప్పారు.

  • Loading...

More Telugu News