Dhulipala Narendra Kumar: డీఐజీ రఘురామిరెడ్డికి ఎంపీ సీటు ఆఫర్ చేసినట్టు తెలిసింది... ఎక్కడ పోటీచేసినా ఓడిస్తాం: ధూళిపాళ్ల నరేంద్ర
- చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సీఐడీ, జగన్ ప్రభుత్వంపై ధూళిపాళ్ల ఆగ్రహం
- 20 నెలలుగా విచారణ జరిపి ఏం సాధించారని ప్రశ్న
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతిష్ఠను దెబ్బతియ్యాలన్న కుట్రలో భాగంగానే ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ సాక్షి రిపోర్టర్ గా మారారని, అందులో ఎటువంటి సందేహం లేదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. స్కిల్లార్ ఇండియా అనేది ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ, పేరు మారిందంతే... కానీ దాన్ని కూడా వాళ్లు షెల్ కంపెనీ అంటున్నారు అని మండిపడ్డారు.
"20 నెలలుగా విచారణ జరుపుతున్నారు... కానీ ఇంతరకు చంద్రబాబు ఖాతాలోకి ఒక్క రూపాయి వచ్చిందని కానీ, లోకేశ్ ఖాతాలోకి ఒక్క రూపాయి వచ్చిందని కానీ సీఐడీ చీఫ్ చెప్పలేకపోతున్నారు. ఇవాళంట... చంద్రబాబునాయుడు గారిని విచారిస్తే నిజాలు బయటికి వస్తాయంట. ఈ కేసులో 32 మందిని అరెస్ట్ చేశారు... దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన పలు కంపెనీల వద్దకు వెళ్లి రికార్డులు ఇతర వివరాలు సేకరించారు. కానీ, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమైనా సంపాదించగలిగారా?
చంద్రబాబుకు దీంతో సంబంధం లేదని వాళ్లకు కూడా తెలుసు. ఈ కేసులో చంద్రబాబును కావాలని అరెస్ట్ చేయడం తప్ప మరొకటి కాదు. గతంలో వైఎస్ హయాంలో కొందరు అధికారులు సీబీఐ కేసుల్లో జైలుకు వెళ్లారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ అధికారులకు కొంచెం వెలుగు వచ్చింది. మళ్లీ నేరస్తులందరూ ఒక్కటయ్యారు.
నాకు ఓ విషయం తెలిసింది... చంద్రబాబు వ్యవహారంలో ఉన్న కొందరు అధికారులకు ఎంపీ సీట్ల హామీ ఇచ్చారట. ముఖ్యంగా డీఐజీ రఘురామిరెడ్డి పేరు వినిపిస్తోంది. పరిస్థితులు మారితే... మీకు ఆఫీసర్ ఉద్యోగం కాకపోతే... రాజకీయ అవకాశం కల్పిస్తాం అనే హామీలు ఇస్తున్నారట. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. రఘురామిరెడ్డి ఉద్యోగం వదిలిపెట్టి ఎక్కడ పోటీచేసినా కచ్చితంగా ఓడిస్తాం.
అసలు ఏమీ లేని ఈ కేసులో అన్యాయంగా వ్యవహరించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. రాబోయే ప్రభుత్వం మాదే, అధికారంలోకి రానున్నది మేమే. డీఐజీ రఘురామిరెడ్డి రాజకీయాల్లోకి వెళ్లొచ్చేమో, ఎంపీగా పోటీచేయవచ్చేమో... కానీ ఈ వ్యవహారంలో చాలామంది ఆఫీసర్లు ఉన్నారు... ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. మీరు నిప్పు రాజేశారు... ఈ నిప్పులో జగన్ మొదలుకుని, ఇందులో ఉన్న అధికారుల వరకు అందరూ బలవ్వడం ఖాయం" అని ధూళిపాళ్ల స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.