Red Card: సినిమాల్లో నటించకుండా ధనుష్, విశాల్ పై రెడ్ కార్డు... తమిళ నిర్మాతల సంఘం సంచలన నిర్ణయం
- నిర్మాతలతో వివాదాల ఫలితం
- ఇవాళ చెన్నైలో తమిళ నిర్మాతల సంఘం సమావేశం
- మొత్తం 14 మంది నటీనటులపై రెడ్ కార్డు!
- జాబితాలో సింబు, అధర్వ, విజయ్ సేతుపతి, అమలాపాల్ తదితరులు
తమిళ నిర్మాతల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. పలువురు అగ్రహీరోలపై రెడ్ కార్డు జారీ చేసింది. ధనుష్, విశాల్, సింబు, అధర్వ ఇకపై సినిమాల్లో నటించకుండా రెడ్ కార్డు విధిస్తున్నట్టు తమిళ నిర్మాతల సంఘం ప్రకటించింది. ఇవాళ నిర్వహించిన కార్యనిర్వాహక సమావేశంలో నిర్మాతల సంఘం ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది.
నిర్మాతలకు సహకరించలేదన్నది సదరు హీరోలపై ఉన్న ప్రధాన ఆరోపణ. నిర్మాత మైఖేల్ రాయప్పన్ తో సింబుకు వివాదం ఉండగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధులు దుర్వినియోగం చేసినట్టు విశాల్ పై ఆరోపణలు ఉన్నాయి.
ఇక, తనందాళ్ చిత్ర నిర్మాణ సంస్థ చేపట్టిన ఓ సినిమా చిత్రీకరణ 80 శాతం పూర్తయ్యాక ధనుష్ సహకరించలేదని, దాంతో నిర్మాతకు నష్టం వాటిల్లిందని తమిళ నిర్మాతల సంఘం ఆరోపిస్తోంది. అధర్వపైనా నిర్మాతలకు సహకరించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ జాబితాలో ఎస్ జే సూర్య, విజయ్ సేతుపతి, అమలా పాల్, వడివేలు, ఊర్వశి, సోనియా అగర్వాల్ సహా 14 మంది నటీనటులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా తమిళ నిర్మాతల సంఘం తీసుకున్న నిర్ణయం కోలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.