Dhulipala Narendra Kumar: విజయసాయిరెడ్డి పూణె వెళ్లి పైరవీలు చేశారు.. చంద్రబాబు పేరు చెబితే రూ. 25 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారు: ధూళిపాళ్ల
- సీమెన్స్ కేసులో చంద్రబాబు పేరు చెప్పాలని డబ్బు ఆశ చూపారన్న ధూళిపాళ్ల
- ఒక్కరు కూడా లొంగలేదన్న టీడీపీ నేత
- బాబు ఖాతాలోకి ఒక్క రూపాయి వచ్చినట్టు కూడా సీఐడీ నిర్ధారించలేకపోయిందన్న ధూళిపాళ్ల
- హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల నిరసనతో ఏపీ ప్రభుత్వానికి చెమటలు పట్టాయని ఎద్దేవా
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం కోసం ఆయన పూణె వెళ్లి పైరవీలు చేశారని ఆరోపించారు. సీమెన్స్ కేసులో చంద్రబాబు పేరు చెబితే రూ. 25 కోట్లు ఇస్తామని పూణె వెళ్లి ఆఫర్లు ఇచ్చారని పేర్కొన్నారు. అయినా సరే ఈ కేసులో అరెస్ట్ అయిన ఒక్కరు కూడా ఆయన పేరు చెప్పేందుకు నిరాకరించారని పేర్కొన్నారు.
సీఐడీ తమ 20 నెలల విచారణలో 32 మంది ఖాతాల లావాదేవీలను పరిశీలించిందని, అయినా ఒక్క రూపాయి కూడా చంద్రబాబు ఖాతాలోకి వచ్చినట్టు నిర్ధారించలేకపోయిందని అన్నారు. జగన్ కళ్లలో ఆనందం చూడ్డానికే చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శించారు. ఈడీ విచారణలోనూ చంద్రబాబుకు డబ్బులు వచ్చాయని ఎక్కడా నిర్ధారించలేకపోయారని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అన్యాయమంటూ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించడంతో ఏపీ ప్రభుత్వానికి చెమటలు పట్టాయన్నారు.