Aliens: మెక్సికో పార్లమెంటులోకి గ్రహాంతరవాసుల మృతదేహాలు.. తీసుకొచ్చి ప్రదర్శించిన పరిశోధకులు!
- 2017లో పెరూలోని నజ్కా ఎడారిలో జరిపిన తవ్వకాల్లో బయటపడిన వింత ఆకారాలు
- గతంలో అమెరికా, జపాన్, బ్రెజిల్ పరిశోధకులు కూడా ఇలాగే చేసిన వైనం
- వీటి నమూనాలు ప్రపంచంలోని మరే జీవితో సరిపోలడం లేదన్న పాత్రికేయుడు
గ్రహాంతరవాసులువిగా చెబుతున్న రెండు వింత భౌతికకాయాలను నేరుగా మెక్సికో పార్లమెంటుకు తీసుకొచ్చిన పరిశోధకులు వాటిని సభలో ప్రదర్శించారు. పెరూలోని నజ్కా ఎడారిలో జరిపిన తవ్వకాల్లో 2017లో ఇవి బయటపడినట్టు చెప్పారు. వీటిని బట్టి గ్రహాంతవాసుల ఉనికి నిజమే అయి ఉంటుందని వారు సభకు వివరించారు. తమ పరిశోధనలో వెలుగుచూసిన అంశాలను పార్లమెంటుకు నివేదించేందుకు వాటిని ఇక్కడకు తీసుకొచ్చినట్టు వారు వివరించారు.
ఈ రెండు ఆకారాలు మానవులవి కావని డీఎన్ఏ పరీక్షల్లోనూ తేలిందని మెక్సికో పాత్రికేయుడు జోస్ జైమ్ మౌసాన్ తెలిపారు. ఈ ప్రపంచంలో అవి మరి దేనికీ సరిపోలడం లేదన్నారు. కాబట్టి గ్రహాంతరవాసులు ఉన్నారనడానికి ఇవే నిదర్శనమని వివరించారు. అయితే, పార్లమెంటుకు తీసుకొచ్చినవి మాత్రం కచ్చితంగా గ్రహాంతరవాసులవేనని తాను చెప్పడం లేదని స్పష్టం చేశారు.
కాగా, పార్లమెంటు సభ్యుల ముందు వాంగ్మూలాలు అందజేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో అమెరికా, జపాన్, బ్రెజిల్ పరిశోధకులు కూడా ఇలానే చేశారు. గ్రహాంతవాసుల ఉనికి నిజమే కావొచ్చని అప్పట్లో వారు కూడా పేర్కొన్నారు.