Nirmala Sitharaman: క్రిప్టో కరెన్సీ విషయంలో దేశాలన్నీ సమష్టిగా నిర్ణయం తీసుకోవాలి: నిర్మలా సీతారామన్
- ఎవరికి వారు నిర్ణయించుకోవడం మంచిదికాదన్న కేంద్ర మంత్రి
- జీ20 ఏకగ్రీవంపై సంతోషం వ్యక్తం చేసిన నిర్మలా సీతారామన్
- వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ లలో సంస్కరణల అవసరం ఉందని వ్యాఖ్య
జీ20 సదస్సుకు భారత్ నేతృత్వం వహించడం, తీర్మానంపై ఏకగ్రీవం సాధించడం సంతృప్తిని కలిగించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా వెల్లడించారు. శుక్రవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. జీ20 సదస్సులో చాలా అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు. క్రిప్టో కరెన్సీ, గ్లోబల్ డెట్ విషయంలో అన్ని దేశాలు సమష్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమష్టి నిర్ణయం వల్లే ఆశించిన ఫలితాలు వస్తాయని, ఏ దేశానికి ఆ దేశం తీసుకునే నిర్ణయాల వల్ల ఉపయోగం ఉండదని వివరించారు.
అదేవిధంగా ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ తదితర సంస్థల్లో సంస్కరణల అవసరం ఉందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. జీ20 సదస్సుకు ఇండియా అధ్యక్షత వహించడం, సదస్సును విజయవంతంగా పూర్తి చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందుచూపు చాలా ఉందన్నారు. ప్రధాని మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేసి, ఆయన సలహాలు, సూచనలతో సదస్సును సక్సెస్ చేసుకున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.