Nara Lokesh: చంద్రబాబుకు జరిగిన అన్యాయం గురించి చెప్పేందుకే ఢిల్లీ వచ్చా: జాతీయ మీడియాతో నారా లోకేశ్

Nara Lokesh talks to national media

  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
  • రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత
  • నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న లోకేశ్
  • నీతిపరులను అవినీతిపరులు జైలుకు పంపుతున్నారని ఆవేదన

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడ్ని స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ వచ్చారు. దేశ రాజధానిలో ఆయన ఈ సాయంత్రం జాతీయ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయం గురించి చెప్పేందుకే తాను ఢిల్లీ వచ్చానని స్పష్టం చేశారు. చంద్రబాబు పట్ల ఎలా వ్యవహరించారో దేశ ప్రజలకు వివరిస్తానని తెలిపారు. 

నీతిపరులను అవినీతిపరులు జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అపరిమిత అధికారం అవినీతికి దారితీస్తుందని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ అంశంలో ఆరోపణలు అయితే చేశారు కానీ, అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారని లోకేశ్ వెల్లడించారు. చంద్రబాబుకు డబ్బు అందిందని నిరూపించలేకపోయారని తెలిపారు. 

ఏపీ ప్రభుత్వం కావాలనే చంద్రబాబును తప్పుడు కేసులో ఇరికించిందని అన్నారు. ఎలాంటి కుంభకోణం జరగలేదని నేను నిరూపించగలను అని సవాల్ విసిరారు. అన్ని పత్రాలు చూపించి అవినీతి జరగలేదని నిరూపిస్తా అని స్పష్టం చేశారు. 

చంద్రబాబుకు గానీ, మాకు గానీ ఎలాంటి డబ్బు అందినట్టు, మా ఖాతాల్లోకి నగదు బదిలీ అయినట్టు సీఐడీ వాళ్లు ఏమైనా నిరూపించగలిగారా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో మేం ఎలాంటి తప్పిదానికి పాల్పడలేదని దీన్నిబట్టే అర్థమవుతోందని లోకేశ్ వివరించారు. న్యాయం కొద్దిగా ఆలస్యం కావొచ్చేమో కానీ, చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికొస్తారని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News