Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి ములాఖత్ ఎందుకు తిరస్కరించామంటే..: జైళ్ల శాఖ వివరణ
- భువనేశ్వరి ములాఖత్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడి
- రిమాండ్ ముద్దాయికి వారంలో రెండు ములాఖత్‌లు మాత్రమే ఉంటాయని వెల్లడి
- అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మూడో ములాఖత్ ఉంటుందని స్పష్టీకరణ
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు ఆయన భార్య భువనేశ్వరికి ఈ రోజు (శుక్రవారం) ములాఖత్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై జైళ్ల శాఖ స్పందించింది. ఈ మేరకు జైళ్ల ఉపశాఖాధికారి ఓ ప్రకటనను విడుదల చేశారు. భువనేశ్వరి ములాఖత్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, కానీ రిమాండ్ ముద్దాయికి ఓ వారంలో రెండు ములాఖత్‌లు మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే జైలు సూపరిండెంటెండ్ అనుమతిస్తే మూడో ములాఖత్‌కు అనుమతి ఉంటుందన్నారు. భువనేశ్వరి అత్యవసర కారణాలను దరఖాస్తులో ప్రస్తావించలేదని, దీంతో మూడో ములాఖత్‌ను తిరస్కరించామని తెలిపారు.
జైలు సూపరింటెండెంట్ సెలవుపై వెళ్లడంపై జైళ్ల శాఖ వివరణ
రాజమండ్రి కేంద్రకారాగారం సూపరింటెండెంట్ రాహుల్ సెలవుపై వెళ్లారు. దీనిపై జైళ్ల శాఖ స్పందిస్తూ... రాహుల్ భార్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్నారని, ఆమె నిన్న ఉదయం ఆసుపత్రిలో చేరారని, దీంతో ఆమెను చూసేందుకు సూపరింటెండెంట్ సెలవు పెట్టారని పేర్కొంది. ఆయనకు నాలుగు రోజులు సెలవు మంజూరు చేసినట్లు తెలిపింది. సూపరింటెండెంట్ ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని పేర్కొంది.