Narendra Modi: ప్రపంచంలో అత్యంత ప్రజాకర్షక నేతగా మరోసారి ప్రధాని మోదీ
- గత కొన్నేళ్లుగా మోదీనే టాప్ గ్లోబల్ లీడర్
- ఈ ఏడాది కూడా ఆయనే!
- తాజాగా జాబితా విడుదల చేసిన మార్నింగ్ కన్సల్ట్
- ఇటీవల సర్వే చేపట్టిన సంస్థ
- అత్యధికంగా 76 శాతం మంది మోదీకి మద్దతు
ఇటీవల భారత్ లో నిర్వహించిన జీ20 సదస్సు అంచనాలకు మించి విజయం సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీ పేరుప్రతిష్ఠలు మరింత ఇనుమడించాయి. కరోనా సంక్షోభం వేళ భారత్ ను నడిపించిన తీరు ప్రపంచ దేశాధినేతల మధ్య మోదీకి ప్రత్యేక స్థానం కల్పించింది. జీ20 సదస్సుతో ఆయన ఛరిష్మా ఉవ్వెత్తున ఎగిసింది.
తాజాగా, 'మార్నింగ్ కన్సల్ట్' అనే సంస్థ చేపట్టిన సర్వేలో మోదీ హవా స్పష్టంగా కనిపించింది. ప్రపంచలోనే అత్యంత ప్రజాకర్షక నేతగా మోదీ మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. 'మార్నింగ్ కన్సల్ట్' సంస్థ ఓ సర్వే నిర్వహించగా, మోదీ నాయకత్వానికి అత్యధికంగా 76 శాతం మంది జై కొట్టారు. రెండో స్థానంలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలాయిన్ బెర్సెట్ ఉన్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మోదీకి, రెండో స్థానంలో ఉన్న బెర్సెట్ కు మధ్య 12 పాయింట్ల అంతరం ఉంది.
గత కొన్నేళ్లుగా, ప్రపంచ ప్రజాదరణ కలిగిన నేతల జాబితాల్లో మోదీనే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏడో స్థానంలో ఉన్నారు. సర్వేలో ఆయనకు 40 శాతం మంది మద్దతు పలికారు. సెప్టెంబరు 6 నుంచి 12 తేదీల మధ్య సేకరించిన సమాచారం ఆధారంగా ఈ జాబితా రూపొందించారు.
ఇక, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను అత్యధికులు తిరస్కరించారు. ఆయనకు వ్యతిరేకంగా 58 శాతం మంది ఓటేశారు. తిరస్కరణ విషయానికొస్తే మోదీకి వ్యతిరేకంగా 18 శాతం మంది మాత్రమే ఓటేశారు.