Tech Mahindra: మేమేమీ జీతాల పెంపు కోసం నిరసన చేయట్లేదు.. ఆఫీసు పనివేళ్లలో అసలే కాదు: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలు చేయొద్దన్న టెక్ మహీంద్రపై ఉద్యోగి ఫైర్
- పోలీసుల సూచనతో సర్క్యులర్లు జారీ చేసిన టెక్ కంపెనీలు
- టెక్ మహీంద్ర కంపెనీకి తిరుగులేని జవాబిచ్చిన ఉద్యోగి
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు
- సర్క్యులర్ జారీ చేసిన మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోందని ఆవేదన
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబును నాయుడు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్, బెంగళూరులోని ఐటీ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు అలాంటివి చేపట్టకుండా చూడాలంటూ ఆయా కంపెనీలను పోలీసులు కోరారు. దీంతో నిరసనల్లో పాల్గొనవద్దంటూ టెక్ కంపెనీలు ఓ సర్క్యులర్ జారీ చేశాయి.
టెక్ మహీంద్ర ఇలా జారీ చేసిన ఓ సర్క్యులర్‌పై ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తామేమీ వేతనాల వార్షిక పెంపు కోసమో, దీపావళి కానుకల కోసమో, అదనంగా పనిచేసిన కాలానికి చెల్లింపుల కోసమో నిరసనలకు దిగట్లేదని, మరీ ముఖ్యంగా ఆఫీసు అవర్స్‌లో అస్సలే చేయట్లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఓ ఉద్యోగి చేసిన పోస్టు వైరల్ అవుతోంది.
తాము న్యాయం కోసం మాత్రమే పోరాడుతున్నామని, తెలుగు రాష్ట్రాల్లో మిలియన్ల కొద్దీ ఐటీ ఇంజినీర్లకు బాటలు వేసిన నాయకుడి కోసం పోరాడుతున్నామని, ఆయనను కాపాడుకోలేకపోతే తమకు సామాజిక బాధ్యత ఉందని చెప్పుకోవడంలో అర్థం ఏముంటుందని ప్రశ్నించాడు. అంతేకాదు, సర్క్యులర్ జారీ చేసిన మిమ్మల్ని చూసి జాలిపడుతున్నానంటూ చేసిన ఆ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టుకు అనూహ్య మద్దతు లభిస్తోంది.