Canada: భారత్, కెనడా మధ్య పెరుగుతున్న ఎడం?
- జీ20 సమావేశాల అనంతరం కీలక పరిణామం
- భారత్‌కు కెనడా వాణిజ్య బృందం రాకడ వాయిదా
- కారణం చెప్పకుండానే పర్యటన వాయిదా వేసిన కెనడా
ఖలిస్థానీ కార్యకలాపాలకు వేదికగా మారుతున్న కెనడాతో భారత్‌కు క్రమంగా ఎడం పెరుగుతోందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. అక్టోబర్‌లో కెనడా వాణిజ్య బృందం భారత పర్యటనను వాయిదా వేస్తున్నట్టు కెనడా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అయితే, పర్యటన వాయిదాకు గల కారణాలను వెల్లడించలేదు. జీ20 సమావేశాల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకోవడంతో ఇరు దేశాల దౌత్య సంబంధాలపై చర్చ మొదలైంది.
జీ20 సమావేశాల సందర్భంగా భారత ప్రధాని మోదీ.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో ఖలిస్థానీ కార్యకలాపాల గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. భారత వ్యతిరేక, వేర్పాటు వాద ఖలిస్థానీ కార్యకలాపాలకు కెనడా వేదిక అవడంపై ఆయన తీవ్ర ఆందోళ వ్యక్తం చేశారు. మరోవైపు, భారత అభ్యంతరాల నేపథ్యంలో కెనడా ప్రధాని దౌత్యపరంగా వైఫల్యం ఎదుర్కొంటున్నారని కెనడాలో ప్రతిపక్షాలు విమర్శలు మొదలెట్టాయి. ఈ క్రమంలో వాణిజ్య బృందం భారత్ పర్యటన వాయిదా పడటం ప్రాధాన్యం సంతరించుకుంది.