Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. వచ్చేస్తోంది స్లీపర్ కోచ్‌లతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్!
- స్లీపర్ కోచ్ రైళ్లతోపాటు పుష్‌పుల్, వందేభారత్ మెట్రో రైళ్లు
- సుదూర ప్రాంతాల మధ్య వేగంగా ప్రయాణించే వీలు
- ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందుబాటులోకి
రైల్వే ప్రయాణికులకు ఇది శుభవార్తే. త్వరలోనే వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వీటిని తీసుకొస్తున్నట్టు ఇంటెగ్రిల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) జనరల్ మేనేజర్ బీజీ మాల్యా వెల్లడించారు. ప్రస్తుతం కోచ్‌లు ఉత్పత్తిలో ఉన్నాయని, వచ్చే ఏడాది మార్చిలో వీటిని ప్రవేశపెడతామని పేర్కొన్నారు.
ఈ రైళ్లు కనుక అందుబాటులోకి వస్తే సుదూర ప్రాంతాల మధ్య వేగంగా ప్రయాణించే వీలు కలుగుతుంది. అలాగే తక్కువ దూరాల మధ్య ప్రయాణం కోసం 12 కోచ్‌లతో వందేభారత్ మెట్రో రైళ్లను వచ్చే ఏడాది జనవరిలో తీసుకొస్తున్నారు. వీటితోపాటు 22 కోచ్‌లతో నాన్ ఏసీ పుష్‌పుల్ ట్రైన్‌ను కూడా ప్రవేశపెడుతున్నట్టు మాల్యా తెలిపారు. అక్టోబరు 31న ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
గంటకు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో ఢిల్లీ - వారణాసి మధ్య ప్రయాణించే తొలి వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లను 15 ఫిబ్రవరి 2019న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమధ్య ప్రారంభించారు. ప్రస్తుతం ఇవి దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి.