Canada: కెనడాలో భారత విద్యార్థిపై వేధింపులు.. విచారణకు డిమాండ్
- కెలోనా ప్రాంతంలో ఘటన
- పిడిగుద్దులు కురిపించి, పెప్పర్ స్ప్రేతో దాడి
- 17 ఏళ్ల సిక్కు విద్యార్థికి ఎదురైన అనుభవం
భారత విద్యార్థిపై వేధింపుల ఘటనలో విచారణ నిర్వహించాలంటూ కెనడా అధికారులను భారత్ కోరింది. ఇటీవల కెలోనా ప్రాంతంలో 17 ఏళ్ల సిక్కు హైస్కూల్ విద్యార్థి బస్టాప్ లో వేధింపులకు గురయ్యాడు. తోటి టీనేజర్ తో వాగ్వాదం ఇందుకు నేపథ్యంగా ఉంది. సిక్కు విద్యార్థిపై పిడిగుద్దులు కురిపించడంతో పాటు, పెప్పర్ స్ప్రే చల్లినట్టుగా వార్తలు వచ్చాయి.
పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బస్సు దిగి ఇంటికి వెళ్లే క్రమంలో 17 ఏళ్ల భారత సిక్కు విద్యార్థిపై బీరు లేదా పెప్పర్ స్ప్రేని మరో టీనేజర్ చల్లినట్టుగా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు సైతం ప్రకటన విడుదల చేశారు. దీనికి ముందు బస్సులో వాగ్వివాదం చోటు చేసుకున్నట్టు తెలిపారు. అందులో పాల్గొన్న వారే దాడికి పాల్పడి ఉంటారని కెనడా పోలీసులు భావిస్తున్నారు. దీంతో వాంకోవర్ లోని భారత కాన్సులేట్ జనరల్ ఈ ఘటనపై విచారణ నిర్వహించాలని కెనడా అధికారులను కోరారు. ఈ ఏడాది మార్చిలోనూ సిక్కు విద్యార్థి గగన్ దీప్ సింగ్ బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ లో దాడికి గురవడం గమనార్హం.