cwc: సీడబ్ల్యూసీ మీటింగ్: అతిథుల కోసం నోరూరించే వంటకాలు
- మొత్తం 78 రకాల వంటకాలు సిద్ధం
- తెలంగాణ రుచులను పరిచయం చేసేలా ఏర్పాట్లు
- వివిధ ప్రాంతాల నుంచి చెఫ్ లను పిలిపించిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్ లో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల కోసం రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేసింది. మీటింగ్ కు అగ్ర నేతలు వస్తుండడంతో వారి కోసం ప్రత్యేకంగా వంటకాలను సిద్ధం చేయించింది. వివిధ ప్రాంతాల నుంచి వంట మనుషులను రప్పించి మరీ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అతిథులకు తెలంగాణ వంటకాలను పరిచయం చేయడంతో పాటు హైదరాబాదీ దమ్ బిర్యానీని ప్రత్యేకంగా వడ్డించనున్నారు. దీంతో పాటు తెలంగాణ స్పెషల్స్ సర్వపిండి, జొన్న సంగటి, సకినాలు, గారెలు, మటన్ కర్రీ, చింత చిగురు మటన్ లతో పాటు మొత్తం 78 రకాల వంటకాలను సిద్ధం చేయించినట్లు కాంగ్రెస్ రాష్ట్ర నేతలు వెల్లడించారు.
ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్ని రకాల వంటకాలు ఉండేలా మెనూను సిద్ధం చేశారు. టిఫిన్ లోకి ఇడ్లీ, వడ, దోశ, పెసరట్టు, ఉగ్గాని, కిచిడీ, ఉప్మా, మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ వడ, రాగి, జొన్న సంగటి, పాయా సూప్, ఖీమా రోటీ, ఫ్రూట్ సలాడ్ లను అతిథులకు వడ్డించనున్నారు. లంచ్.. హైదరాబాదీ దమ్ బిర్యానీ, హలీమ్, బగారా రైస్, కుర్మా, దాల్చా మటన్, స్పెషల్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, తలకాయ కూర, లివర్ ఫ్రై, తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ, చింతచిగురు మటన్, గోంగూర మటన్, చేపలు వడ్డిస్తారు. సాయంత్రం పూట స్నాక్స్ గా ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సర్వపిండి, సమోసాలు, కుడుములు, మురుకులు, మొక్కజొన్న పొత్తులు, సకినాలు, గారెలు అందిస్తారు. శాకాహారుల కోసం పచ్చి పులుసు, గోంగూర పచ్చడి, గుత్తి వంకాయ కూర, కొబ్బరి పచ్చడి, అంబలి, దాల్చా, రోటీ పచ్చళ్లను సిద్ధం చేశారు.